గురువారం 16 జూలై 2020
National - Jun 24, 2020 , 12:37:14

చైనా వస్తువులకు క్లియరెన్స్‌ ఇవ్వని కస్టమ్స్‌

చైనా వస్తువులకు క్లియరెన్స్‌ ఇవ్వని కస్టమ్స్‌

కోల్‌కతా : కస్టమ్స్‌ విభాగం అధికారులు చైనా వస్తువులకు క్లియరెన్స్‌ ఇవ్వడం నిలిపివేశారు. ఈ ఘటన కోల్‌కతాలోని నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. చైనా నుంచి తీసుకువచ్చిన ఏ వస్తువుకైనా అధికారులు అనుమతిని నిరాకరిస్తున్నారు. చైనా వస్తువులను అడ్డుకోవడంపై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి అధికారిక ఆదేశాలు జారీ చేయనప్పటికి అంతర్గతంగా తీసుకున్న నిర్ణయం మేరకు అధికారులు ఈ చర్యకు ఉపక్రమించారు.

గల్వాన్‌ లోయలో భారత్‌-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. అప్పటి నుండి కోల్‌కతా విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు చైనా నుంచి తీసుకువచ్చిన వస్తువులకు క్లియరెన్స్‌ ఇవ్వడం బంద్‌ చేశారు. చైనా దాడికి నిరసనగా ఆ దేశ వస్తువులను బహిష్కరించాలని పలువురు రాజకీయ నాయకులు, ప్రజలు పిలుపునిస్తున్నారు. పలు ప్రభుత్వ సంస్థలు సైతం చైనాతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నాయి. మరికొన్ని ఒప్పందాలను సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నాయి. వ్యాపారులు సైతం ఇకపై చైనా వస్తువులను అమ్మబోం అని ప్రకటిస్తున్నారు.


logo