గురువారం 16 జూలై 2020
National - Jun 28, 2020 , 17:13:26

యువకుడి మర్మాంగంపై బూట్లతో కొట్టిన పోలీసులు.. చికిత్స పొందుతూ మృతి

యువకుడి మర్మాంగంపై బూట్లతో కొట్టిన పోలీసులు.. చికిత్స పొందుతూ మృతి

చెన్నై: తమిళనాడు పోలీసులు ఓ యువకుడిపట్ల అనుచితంగా ప్రవర్తించారు. బూట్లతో అతడి ఛాతి, మర్మాంగంపై కొట్టడంతో అంతర్గత గాయాలతో చికిత్స పొందుతూ మరణించాడు. తేన్కాసికి చెందిన 25 ఏండ్ల ఎన్‌ కుమారేశన్‌ ఆటో నడుపుతుంటాడు. ఆస్తి వివాదం నేపథ్యంలో సెంథిల్ అనే వ్యక్తితో గొడవపడ్డాడు. అతడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మే 8న వీరకేరలంపుదూర్ పోలీసులు కుమారేశన్‌ను పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించారు. ఎస్‌ఐ చంద్రశేఖర్‌ అతడి చెంపపై కొట్టి బూతులు తిట్టాడు. మే 9న ఆటో వద్ద ఉన్న కుమారేశన్‌ను స్టేషన్‌కు వచ్చి కలవమని ఆ ఎస్‌ఐ చెప్పాడు. ఈ సందర్బంగా వాగ్వాదం జరుగగా, ఇద్దరం ఖాకీ దుస్తులు ధరించేవాళ్లమేనని కుమారేశన్‌ అన్నారు. 

తమ యూనిఫాంను ఆటో డ్రైవర్‌ డ్రస్‌తో పోల్చడంపై ఎస్‌ఐ చంద్రశేఖర్‌ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. మే 10న పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన కమారేశన్‌పై తన ప్రతాపం చూపించాడు. కానిస్టేబుల్‌ కుమార్‌తో కలిసి అతడ్ని చితకబాదారు. ఇద్దరు కలిసి బూట్లతో అతడి ఛాతి, కడుపుతోపాటు మర్మాంగతంపై గట్టిగా కొట్టారు. అనంతరం ఒంగోపెట్టి చావబాదారు. ఈ విషయం ఎవరికైనా చెబితే తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్‌ చేస్తామని బెదిరించారు.  

ఈ దెబ్బలకు అంతర్గత రక్తస్రావంతో ఈ నెల 10న కుమారేశన్‌ అనారోగ్యానికి గురయ్యాడు. నోటి వెంట రక్తం రావడంతోపాటు, శ్వాస సమస్యతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు తొలుత ఓ ప్రైవేట్‌ దవాఖానకు తీసుకెళ్లారు. అతడి ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో తిరునెల్వేలి ప్రభుత్వ వైద్య కళాశాల దవాఖానకు రిఫర్‌ చేశారు. కుమారేశన్‌ను అక్కడికి తరలించగా అతడి కిడ్నీ, ఊపిరితిత్తులు, ఇతర భాగాలకు అంతర్గత గాయాలైనట్లు వైద్య పరీక్షల్లో బయటపడింది. దీనిపై వైద్యులు ఆరా తీయగా పోలీసుల టార్చర్‌ గురించి అతడు చెప్పాడు. 

కాగా, జూన్‌ 14న దవాఖానకు వచ్చిన పోలీసులు కుమారేశన్‌ నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. అయితే పోలీసుల దాడిపై స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకునేందుకు వారు నిరాకరించినట్లు తండ్రి నవనీత కృష్ణన్‌ తెలిపారు. గత వారం ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోయిందన్నారు. మరోవైపు రెండు వారాలుగా దవాఖానలో ఉన్న కుమారేశన్‌ చికిత్స పొందుతూ శనివారం రాత్రి చనిపోయాడు. దీంతో అతడి కుటుంబసభ్యులు, స్థానికులు పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు కుమారేశన్‌ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ చంద్రశేఖర్‌తోపాటు కానిస్టేబుల్‌ కుమార్‌ను సస్పెండ్‌ చేశారు. ఈ కేసుపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.logo