ఆదివారం 05 జూలై 2020
National - Jun 30, 2020 , 18:24:01

పండర్‌పూర్‌లో కర్ఫ్యూ

పండర్‌పూర్‌లో కర్ఫ్యూ

షోలాపూర్‌: మహారాష్ట్రలోని షోలాపూర్‌ జిల్లా పండర్‌పూర్‌లో తొలి ఏకాదశి పూజల నేపథ్యంలో జనం గుమిగూడకుండా మంగళవారం సాయంత్రం నుంచి కర్ఫ్యూ విధించారు. ఇక్కడి విఠోభా ఆలయంలో జరిగే పూజలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు. అయితే, ఇక్కడ కొవిడ్‌ కేసులు ఎక్కువగా ఉండడంతో జనం పెద్ద సంఖ్యలో పోగుకాకుండా ఉండేందుకు కర్ఫ్యూ విధించినట్లు అధికారులు పేర్కొన్నారు. 

విఠోభా ఆలయంలో ప్రతిఏటా ఆషాఢ ఏకాదశి పూజలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఇక్కడికి మహారాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. లక్షలాది మంది వార్కారీస్‌ సంత్‌ జ్ఞానేశ్వర్‌, సంత్‌ తుకారాం పాదుకలను పల్లకీలో తీసుకొని వస్తుంటారు. దీనిని వారీ యాత్ర అని పిలుస్తారు. ఈ ఆచారం శతాబ్దాలుగా కొనసాగుతున్నది. అయితే, ఈ సారి కొవిడ్‌ విజృంభణ నేపథ్యంలో వారీ యాత్రను రద్దు చేశారు. కేవలం 20 మంది వార్కారీలు మాత్రమే బస్సులో పాదుకలను తెచ్చేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కర్ఫ్యూ విధించారు. సోమవారం రాత్రి షోలాపూర్‌ కలెక్టర్‌ మిలింద్‌ షంభార్కర్‌ కర్ఫ్యూ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి జూలై 2 అర్ధరాత్రి వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే, కొంతమంది మాత్రమే గుడిని తెరిచేలా అనుమతించారు. logo