సోమవారం 13 జూలై 2020
National - Jul 01, 2020 , 14:58:11

సోపోర్‌లో ఎన్‌కౌంటర్‌..చెలరేగిన వివాదం..

సోపోర్‌లో ఎన్‌కౌంటర్‌..చెలరేగిన వివాదం..

న్యూ ఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని సోపోర్‌లో బుధవారం ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇందులో ఓ సాధారణ పౌరుడు మరణించగా, ఈ ఘటనపై వివాదం చెలరేగింది. అతడిని సీఏఆర్పీఎఫ్‌ బలగాలు చంపాయని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తుండగా, ఉగ్రవాదుల కాల్పుల్లోనే మరణించాడని సీఆర్పీఎఫ్‌ చెబుతున్నది. స్థానికంగా ఉన్న ఓ ప్రార్థనా స్థలంలోంచి ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, అందులోనే అతడు చనిపోయాడని సీఏఆర్పీఎఫ్‌ ప్రకటించింది.

‘సోపోర్‌ నుంచి కుప్వారా వెళ్తున్న ఓ పౌరుడి కారు ఉగ్రవాదుల కాల్పుల్లో చిక్కుకుంది. ఆ కారును ఒక వృద్ధుడు నడుపుతున్నాడు.  అందులో ఓ బాలుడు కూడా ఉన్నాడు. కాల్పులను గమనించిన వృద్ధుడు కారును ఆపేసి, సురక్షిత ప్రాంతానికి వెళ్తుండగా బుల్లెట్‌ తగిలి అక్కడికక్కడే మరణించాడు. అనంతరం సీఆర్పీఎఫ్‌ బలగాలు అందులో ఉన్నబాలుడిని రక్షించాయి’ అని సీఆర్పీఎఫ్‌ పేర్కొంది. కాగా, వృద్ధుడు, బాలుడు పనిమీద ఉదయం సోపోర్‌ వెళ్లారని, అక్కడ సీఆర్పీఎఫ్‌ బలగాలు వీరిపై కాల్పులు జరిపి వృద్ధుడిని చంపేశాయని మృతుడి దగ్గరి బంధువు చేసిన ఆరోపణలకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.  

సీఆర్పీఎఫ్‌ ప్రకారం, బుధవారం ఉదయం 7:30 గంటలకు, 179 బెటాలియన్ నాకా ( పెట్రోలింగ్ విధుల) కోసం సోపోర్‌లో మోడల్‌టౌన్‌ చౌక్‌కు చేరుకుంది. దళాలు తమ మోహరింపు స్థలాలను ఆక్రమించేందుకు వాహనాల నుంచి దిగుతున్నప్పుడు, సమీపంలోని ఓ ప్రార్థనా స్థలంలోని అటకపై దాక్కున్న ఉగ్రవాదులు దళాలపై విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు. ఇందులో సీఆర్పీఎఫ్‌ జవాన్స్ కానిస్టేబుల్ బోయ రాజేశ్‌, హెడ్ కానిస్టేబుల్ దీప్‌చంద్‌వర్మ, నీలేశ్‌చావ్డే, కానిస్టేబుల్ దీపక్ పాటిల్ గాయపడ్డారు. అనంతరం దీప్‌చంద్‌ గాయాలపాలయ్యాడు. 

కాగా, రెండు వాహనాల్లో ఉగ్రవాదులున్న ప్రదేశానికి వెళ్లి పొజిషన్‌ తీసుకున్నామని, అప్పుడే  అటుగా వస్తున్న వృద్ధుడి వాహనం ఉగ్రవాదుల కాల్పుల్లో చిక్కుకున్నదని సీఆర్పీఎఫ్‌కు చెందిన ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. వృద్ధుడు కారు దిగి, సురక్షిత ప్రాంతానికు వెళ్తుండగా ఉగ్రవాదులు భద్రతా బలగాలపై జరిపిన కాల్పుల్లో చిక్కుకున్నాడని పేర్కొన్నారు.  అనంతరం అతడితో ఉన్న బాలుడిని భద్రతా సిబ్బంది కాపాడారన్నారు. ఆ బాలుడిని తన దగ్గరుకు రమ్మని ఆర్మీ జవాన్‌ పిలువడంతోపాటు అతడికి రక్షణగా ఉండి జవాన్‌ ఉగ్రవాదులుపై కాల్పులు జరుపుతున్నట్లు ఓ ఫొటోలో కూడా స్పష్టంగా కనిపిస్తున్నదని సీనియర్‌ అధికారి వివరించారు.    


logo