మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 09, 2020 , 14:33:12

యూపీ నేతల్లో చాలా మటుకు నేరగాళ్లే!

యూపీ నేతల్లో చాలా మటుకు నేరగాళ్లే!

లక్నో : గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే అరెస్టు నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ నాయకుల నేర సామ్రాజ్యం మరోసారి చర్చనీయాంశమయ్యింది. వికాస్ దుబే అరెస్ట్ తో యూపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అసలింతకు గ్యాంగ్ స్టర్లు ఎలా పుట్టుకొస్తారు? వీరంతా భవిష్యత్ రాజకీయ నాయకులేనా? అనే అంశాలు జోరుగా చర్చిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ నాయకుల క్రిమినల్ రికార్డును పరిశీలిస్తే.. ఇక్కడ ఇలాంటివి సర్వసాధారణమే అని అనుకోవాల్సిందే.

22 కోట్లకు పైగా జనాభా ఉన్న ఉత్తర ప్రదేశ్.. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం. ఇక్కడి జనాభా పాకిస్తాన్‌కు సమానం. అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలు కూడా అత్యధికంగా ఉన్నాయి. 80 లోక్‌సభ ఎంపీలు, 403 మంది ఎమ్మెల్యేలు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో గెలువాలనే ఏకైక కాంక్షే అన్ని పార్టీలను క్రిమినల్ రికార్డులు ఉన్న అభ్యర్థులను బరిలో నిలబెట్టేందుకు ప్రోత్సహిస్తున్నాయని చెప్పవచ్చు. 

44 మంది ఎంపీలపై క్రిమినల్‌ కేసులు

అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక ప్రకారం.. 2019 లో యూపీ నుంచి ఎన్నికైన 80 లోక్ సభ ఎంపీలలో 44 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికైన 403 మంది ఎమ్మెల్యేల్లో 147 మందిపై క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 4823 మంది బరిలోనిలువగా.. 859 మందికి క్రిమినల్ కేసులు ఉన్నాయి. అంటే.. 17 శాతం అన్నమాట. ఈ 859 మందిలో 704 మంది తీవ్రమైన క్రిమినల్ కేసులు కలిగి ఉన్నారు. తీవ్రమైన నేరాలు అంటే 5 ఏండ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష విధించే అవకాశాలున్న, బెయిల్ లేని నేరాలు అన్నమాట.

బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ, ఆర్‌ఎల్డీ, కాంగ్రెస్ పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో 1,480 మంది అభ్యర్థులను నిలబెట్టాయి. వీరిలో 492 మంది అభ్యర్థులు క్రిమినల్ కేసులు కలిగి ఉన్నారు. దీని ప్రకారం, ఈ ఐదు పార్టీలు అసెంబ్లీ ఎన్నికలలో నిలబడిన మొత్తం అభ్యర్థుల్లో 33 శాతం కంటే ఎక్కువ మంది క్రిమినల్ కేసులు కలిగి ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో 979 మంది అభ్యర్థులు ఉత్తరప్రదేశ్‌లోని 80 లోక్‌సభ స్థానాల్లో పోటీపడ్డారు. వీరిలో నుంచి 220 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ నుంచి బరిలో నిలిచిన 216 మంది అభ్యర్థుల అఫిడవిట్ విశ్లేషించగా.. ఈ నాలుగు పార్టీల నుంచి క్రిమినల్ నేపథ్యం ఉన్న 117 మంది అభ్యర్థులు ఉన్నట్టు తేలింది. అంటే, ఈ నాలుగు పార్టీలు నిలబెట్టిన అభ్యర్థులలో 54 శాతం కంటే ఎక్కువ మంది క్రిమినల్ కేసులు కలిగి ఉన్నారు.

ఇక, లోక్‌సభ ఎన్నికల్లో 79 మంది ఎంపీల అఫిడవిట్ విశ్లేషణ జరుపగా.. 44 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అంటే, గెలిచిన ఎంపీలలో 56 శాతం మంది క్రిమినల్ నేపథ్యం నుండి వచ్చినవారే అని తేలింది. బీజేపీ నుంచి ఎంపీలుగా గెలుపొందిన 35 మంది అభ్యర్థులకు క్రిమినల్ రికార్డు ఉన్నట్టు తేలింది. కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన సోనియా గాంధీపై కూడా నేరచరిత్ర ఉన్నట్టు అఫిడవిట్లో పేర్కొన్నారు.

ఇక హంతకుల గురించి కూడా మనం మాట్లాడుకుంటే.. ఉత్తర ప్రదేశ్ శాసనసభలో ఐదుగురు ఎమ్మెల్యేలపై హత్యలు చేసినట్లుగా, హత్యాయత్నాలకు పాల్పడినట్లుగా తేలింది. వీరిలో విజయ్ కుమార్ (గ్యాన్ పూర్) , అశోక్ సింగ్ చందేల్ (హమీర్ పూర్), ఇంద్రప్రతాప్ తివారీ (గోసాయి గంజ్), సురేశ్వర్ సింగ్ ( మాసి), ముక్తార్ అన్సారీ (మావు) ఉన్నారు.


logo