బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 16:10:48

తల్లి భాషలో చదువుతోనే సృజనాత్మకత: వెంకయ్య

తల్లి భాషలో చదువుతోనే సృజనాత్మకత: వెంకయ్య

న్యూఢిల్లీ : విద్యారంగంతోపాటు పరిపాలన, న్యాయ, పరిశోధన తదితర రంగాల్లో మాతృభాష వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించడం, కొత్త పదాల సృష్టి జరిగినపుడే తల్లి భాషను పరిరక్షించుకోగలమని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగం, తెలుగు అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ‘జ్ఞానసముపార్జన మాధ్యమం: మాతృభాష’ ఇతివృత్తంతో బుధవారం జరిగిన వెబినార్‌ను ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మన సంస్కృతి-సంప్రదాయాలకు మన అస్తిత్వానికి మాతృభాషే పట్టుకొమ్మ. మాతృభాషతోపాటు ఇతర భాషలు ఎన్నయినా నేర్చుకోవచ్చు. నేర్చుకోవాలి కూడా. ఎన్ని భాషలు ఎక్కువగా నేర్చుకుంటే అంత ఎక్కువ మంచిది. అందులో తప్పేమీ లేదు. కానీ.. ఆంగ్లభాషలో విద్యాభ్యాసం ద్వారానే అభివృద్ధి జరుగుతుందని అనుకోవడం సరికాదు. కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా జరిగిన సర్వేల ఫలితాలను గమనిస్తే ఈ విషయం మనకు బాగా అవగతమవుతుంది’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

‘అన్ని భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా’ అన్న కాళోజీ నారాయణరావుగారి మాటను కూడా ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ఉటంకించారు.

2017 వరకు నోబెల్ బహుమతి పొందినవారిలో 90 శాతానికి పైగా మాతృభాషలో విద్యనభ్యసించే దేశాల వారేనని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. ప్రసార, ప్రచార మాధ్యమాలు కూడా మాతృభాషకు వీలైనంత ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని.. పాత పదాలను పునర్వినియోగంలోకి తీసుకురావడంతోపాటు కొత్త పదాలను సృష్టించడంపై దృష్టిపెట్టాలన్నారు.  ‘జ్ఞానసముపార్జన మాధ్యమం: మాతృభాష’ ఇతివృత్తంతో అంతర్జాతీయ అంతర్జాల వెబినార్‌ నిర్వహించిన హైదరాబాద్ విశ్వవిద్యాలయ తెలుగు శాఖ, తెలుగు అకాడమీలను ఉపరాష్ట్రపతి అభినందించారు. భాషాభివృద్ధికి, కొత్త పదాల సృష్టికి వర్సిటీలు వేదికగా నిలిచి మిగిలిన వారిని ప్రోత్సహించాలని సూచించారు. 

ఈ కార్యక్రమంలో హైదరాబాద్ విశ్వవిద్యాలయ ఉప కులపతి ఆచార్య పొదిలి అప్పారావు, డీఆర్డీవో చైర్మన్ సతీశ్ రెడ్డి, విశ్వవిద్యాలయ తెలుగు విభాగం అధిపతి ఆచార్య అరుణ కుమారి, శాంతా బయోటెక్ ఫార్మా కంపెనీ చైర్మన్, తెలుగు భాషాభిమాని కేఎల్ వరప్రసాద్ రెడ్డి, తెలుగు అకాడమీ డైరెక్టర్ ఏ సత్యనారాయణ రెడ్డి, తెలంగాణ అధికార భాషాసంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర రావు, సదస్సు నిర్వాహకురాలు ఆచార్య డీ విజయలక్ష్మితోపాటు విశ్వవిద్యాలయ తెలుగు విభాగం ఆచార్యులు, విద్యార్థులు, భాషాకోవిదులు, విషయ నిపుణులు, భాషాభిమానులు పాల్గొన్నారు.


logo