శనివారం 15 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 00:47:42

విశాఖ షిప్‌యార్డులో కూలిన భారీ క్రేన్‌..

విశాఖ షిప్‌యార్డులో కూలిన భారీ క్రేన్‌..

11 మంది దుర్మరణం పలువురికి గాయాలు 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఏపీలోని విశాఖ నగరాన్ని ప్రమాదాల బెడద వీడటం లేదు. ఎల్జీపాలిమర్స్‌లో గ్యాస్‌ లీకేజీ ఘటన మొదలు వరుస ప్రమాదాలతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. శనివారం హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌లో భారీ క్రేన్‌ ద్వారా లోడింగ్‌ పనులను పరిశీలిస్తుండగా అది ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. క్రేన్‌ పరిమాణం భారీగా ఉండటంతో దాని కింద ఉన్న కార్మికులు తప్పించుకునేందుకు వీలుపడలేదు. ప్రమాద సమయంలో సుమారు 18 మంది క్రేన్‌ కింద ఉన్నట్టు తెలుస్తున్నది. 11 మంది మృతిచెందగా.. పలువురికి గాయాలయ్యాయి. సహాయ సిబ్బంది క్షతగాత్రులను సమీప దవాఖానకు తరలించారు. మృతుల్లో నలుగురు హెచ్‌ఎస్‌ఎల్‌ ఉద్యోగులు, ఏడుగురు కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఉన్నారని జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌ పేర్కొన్నారు. దుర్ఘటనపై కేంద్ర       మంత్రి రాజ్‌నాథ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకునేందుకు డిపార్ట్‌మెంటల్‌ ఎంక్వైరీ కమిటీని నియమించినట్టు చెప్పారు. కూలిన క్రేన్‌ను పదేండ్ల క్రితం హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ కొనుగోలుచేసింది. 

ఘటనపై సీఎం జగన్‌ ఆరా

షిప్‌యార్డులో క్రేన్‌ కూలిన ఘటనపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. వెంటనే రక్షణ చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్‌, పోలీసు కమిషనర్లను ఆదేశాలు జారీచేశారు. ప్రమాదానికి గల కారణాలపై యాజమాన్యంతో చర్చించి వివరాలను సేకరించాలని సూచించారు. కార్మికుల మృతిపై జగన్‌ తీవ్ర విచారం వ్యక్తంచేశారు.

తాజావార్తలు


logo