శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 19:01:15

పరీక్షలు రద్దు చేయండి.. సుప్రీంకోర్టులో విద్యార్థుల పిటిషన్

పరీక్షలు రద్దు చేయండి.. సుప్రీంకోర్టులో విద్యార్థుల పిటిషన్

న్యూఢిల్లీ: యూనివర్సిటీల్లో చివరి ఏడాది పరీక్షలు రద్దు చేయాలంటూ దేశవ్యాప్తంగా సుమారు 30 మంది విద్యార్థులు సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరులోగా తుది పరీక్షలను నిర్వహించాలని అన్ని యూనివర్సిటీలకు సూచిస్తూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇటీవల జారీ చేసిన ఉత్తర్వును వారు సవాల్ చేశారు. చాలా మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కరోనా బారిన పడ్డారని, అలాంటి విద్యార్థులను పరీక్షలు రాయాలని బలవంతం చేయడం తగదని పిటిషన్‌లో పేర్కొన్నారు.

సాధారణంగా జూలై నెలాఖరు నాటికే మార్కులు, డిగ్రీ సర్టిఫికేట్లను ఇస్తారని, పరీక్షలు సెప్టెంబర్‌లో నిర్వహిస్తే  ఈ ప్రక్రియ మరింత ఆలస్యమవుతుందని విద్యార్థులు పేర్కొన్నారు. దీంతో ఉన్నత చదువులు, ఉద్యోగాలు పొందే అర్హతను కోల్పోతామని, ఆర్టికల్ 14 ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. ఈ నేపథ్యంలో సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఎన్ఐఓఎస్ వంటి విద్యా బోర్డుల మాదిరిగా విద్యార్థుల ఇటర్నల్ అసెస్‌మెంట్ ఆధారంగా తుది ఫలితాలు ప్రకటించాలని కోరారు. ఈ పిటిషన్ దాఖలు చేసిన 30 మందిలో కరోనా పాజిటివ్ విద్యార్థి ఒకరు ఉన్నారు.


logo