మంగళవారం 19 జనవరి 2021
National - Jan 10, 2021 , 00:58:32

16 నుంచి టీకా

16 నుంచి టీకా

  • తొలుత 3 కోట్ల కరోనా యోధులకు
  • తదుపరి 50 ఏండ్లు పైబడినవారికి 
  • కరోనా వ్యాక్సినేషన్‌పై మోదీ సమీక్ష
  • రెండ్రోజుల్లో రాష్ర్టానికి వ్యాక్సిన్లు
  • తొలి విడుతలో 80 లక్షల మందికి
  • వారంలో ప్రక్రియ పూర్తికి చర్యలు

ఏడాదిగా దేశాన్ని వణికిస్తున్న కరోనా రక్కసి పీచమణిచేందుకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 16 నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రంలో తొలి విడుతలో 80 లక్షల మందికి టీకా వేయనున్నారు. 800కుపైగా కేంద్రాల్లో అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. 

మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న 3 కోట్ల మంది కరోనా యోధులకు తొలి విడుతలో టీకాలు అందించనున్నారు. అనంతరం 50 ఏండ్లపైబడినవారికి, ఆ తర్వాత దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 50 ఏండ్లలోపు వారికి వ్యాక్సిన్లు వేస్తారు. ఆ తర్వాత విడుతల వారీగా సామాన్య ప్రజలకు వ్యాక్సినేషన్‌ చేస్తారు. సోమ లేదా మంగళవారాల్లో రాష్ర్టానికి టీకాలు చేరుకుంటాయని అధికారులు అంచనావేస్తున్నారు. వ్యాక్సిన్‌పై ప్రజల్లో భరోసా కల్పించేందుకు తొలి టీకా తానే వేసుకుంటానని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు.  

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జనవరి 9 (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారికి ముకుతాడు వేసేందుకు సమయం ఖరారైంది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఈనెల 16 నుంచి దేశవ్యాప్తంగా మొదలుకానుంది. మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న మూడు కోట్ల మంది కరోనా యోధులకు తొలి విడుతలో టీకాలు వేయనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం జరిగిన అత్యున్నత సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశంలో కరోనా వ్యాప్తి, వ్యాక్సినేషన్‌ సన్నద్ధతపై ప్రధాని ఈ సమావేశంలో సమీక్షించారు. మకర సంక్రాంతి, లోహ్రి, మాఘ్‌ బిహు పండుగల నేపథ్యంలో ఈ నెల 16 నుంచి దేశంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్టు ప్రభుత్వం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. వైద్యసిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల తర్వాత 50 ఏండ్లు పైబడినవారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు పేర్కొంది. అనంతరం దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న 50 ఏండ్లలోపు వారికి టీకాలు అందించనున్నట్టు తెలిపింది. ఈ రెండు క్యాటగిరీల వారు దాదాపు 27 కోట్ల మంది ఉంటారని అంచనా

కొ-విన్‌తో నిరంతర పర్యవేక్షణ

కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు రూపొందించిన కొ-విన్‌ వ్యాక్సిన్‌ పంపిణీ నిర్వహణ వ్యవస్థను అధికారులు ప్రధాని మోదీకి వివరించారు. దీని ద్వారా వ్యాక్సిన్‌ నిల్వ, పంపిణీ, లబ్ధిదారుల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. రిజిస్టర్‌ చేసుకున్న లబ్ధిదారులకు సెషన్‌ కేటాయింపు, వారి వివరాల ధ్రువీకరణ, టీకా అనంతరం డిజిటల్‌ సర్టిఫికెట్‌ జారీకి ఇది దోహదపడుతుంది. ఇప్పటికే 79 లక్షలమంది లబ్ధిదారులు కొ-విన్‌లో రిజిస్టర్‌ చేసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. 

రాష్ట్రంలో 800కుపైగా కేంద్రాల్లో..

ఈ నెల 16 నుంచి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్య శాఖ అధికారులు పూర్తిగా సంసిద్ధమయ్యారు. రాష్ట్రంలో తొలివిడుతలో 80 లక్షలమందికి టీకా అందించనున్నారు. సోమవారం లేదా మంగళవారాల్లో రాష్ర్టానికి వ్యాక్సిన్లు చేరుకుంటాయని అధికారులు అంచనావేస్తున్నారు. వ్యాక్సిన్లు వేసేందుకు 800కుపైగా కేంద్రాల్లో ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఒక్కో కేంద్రంలో రోజుకు 100 నుంచి 150 మందికి టీకాలు వేసి వారం రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇక తొలి విడుతలో టీకా అందించే 50 ఏండ్ల పైబడినవారిని గుర్తించేందుకు 2021 జనవరి 1వ తేదీని కటాఫ్‌ తేదీగా పరిగణించనున్నారు. అంటే 1971, జనవరి 1కి ముందు జన్మించిన వారు మాత్రమే ఈ క్యాటగిరీలోకి వస్తారు. మొదట నేనే వ్యాక్సిన్‌ వేసుకుంటా: మంత్రి ఈటల

రాష్ట్రంలో ఈ నెల 16న వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. దేశంలోనే తొలి వ్యాక్సిన్‌ను తెలంగాణ నుంచే ప్రారంభించాలని ప్రధానిని కోరుతాం. ప్రజలకు భరోసా కల్పించేందుకు నా వంతు బాధ్యతగా తొలి టీకా నేనే వేసుకుంటా. తొలి రోజు 139 కేంద్రాల్లో 13,900 మందికి టీకా అందిస్తాం. ఇప్పటి వరకు 2.9 లక్షల మంది హెల్త్‌ కేర్‌ వర్కర్లు టీకాలు వేసుకునేందుకు పేర్లు నమోదు చేసుకున్నారు. 16న రాష్ట్రంలోని రెండు వ్యాక్సిన్‌ కేంద్రాలతో ప్రధాని మోదీ సంభాషిస్తారు. టీకా ప్రక్రియను పరిశీలిస్తారు.భారత టీకాల కోసం ప్రపంచం ఎదురుచూపు

కరోనా నుంచి మానవాళిని రక్షించేందుకు రెండు ‘మేడిన్‌ ఇండియా’ టీకాలతో భారత్‌ సిద్ధంగా ఉన్నదని ప్రధాని మోదీ అన్నారు. భారత టీకాల కోసం ప్రపంచం ఎదురుచూస్తున్నదని, అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఎలా చేపడుతున్నదో ఆసక్తిగా తిలకిస్తున్నదని పేర్కొన్నారు. 16వ ప్రవాసీ భారతీయ దివస్‌ సదస్సును శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ప్రపంచానికి ఫార్మా కేంద్రంగా భారత్‌ నిలిచిందని చెప్పారు. భారత్‌లో తయారైన ఉత్పత్తులనే ఎక్కువగా వాడాలని ప్రవాస భారతీయులకు  విజ్ఞప్తి చేశారు. జపాన్‌లో పనిచేస్తున్న తెలంగాణ శాస్త్రవేత్త మురళీధర్‌ మిర్యాల సహా 30 మంది ప్రవాసీయులకు ప్రవాసీ భారతీయ సమ్మాన్‌ను రాష్ట్రపతి బహూకరించారు.

90కి చేరిన బ్రిటన్‌ రకం కేసులు

దేశంలో బ్రిటన్‌ రకం కరోనా కేసులు 90కి చేరాయి. మొత్తంగా ఇప్పటివరకు 1.04 కోట్ల మంది కరోనాబారినపడగా, 1.5 లక్షలమంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశంలో 2.24 లక్షల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో రోజుకు 98,000 వరకు కేసులు నమోదుకాగా, ప్రస్తుతం అవి 20వేలకు దిగివచ్చాయి. అమెరికా తర్వాత భారత్‌లోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. 

ముక్కు ద్వారా కరోనా టీకా!

కరోనా కట్టడి కోసం భారత్‌ బయోటెక్‌.. ముక్కు ద్వారా వేసుకోగలిగే టీకాను అభివృద్ధి చేస్తున్నది. ఈ టీకా ట్రయల్స్‌ ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ టీకా కోసం భారత్‌ బయోటెక్‌ సంస్థ అమెరికాకు చెందిన వాషింగ్టన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌తో చేతులు కలిపింది. 

టీకా వలంటీర్‌ మృతి

వ్యాక్సిన్‌ ప్రయోగంలో పాల్గొన్న ఓ వలంటీర్‌ మరణించటం కలకలం రేపింది. భోపాల్‌కు చెందిన దీపక్‌ మరావి అనే వ్యక్తి గత నెల 12న భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా మూడో దశ ట్రయల్స్‌లో పాల్గొన్నారు. టీకా వేసుకున్న 9 రోజుల తర్వాత ఆయన మరణించారు. అయితే ఆయన మరణానికి కొవాగ్జిన్‌ కారణం కాదని భారత్‌ బయోటెక్‌ పేర్కొంది. విష ప్రభావం వల్ల గుండె, ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తి మరణించినట్టు పోస్టుమార్టంలో తేలిందని పేర్కొంది. 

వ్యాక్సినేషన్‌ జరిగేదిలా!

కరోనా వైరస్‌కు కళ్లెం వేసేందుకు మెగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి దేశం సిద్ధమైంది. 16 నుంచి దేశవ్యాప్తంగా టీకా పంపిణీ మొదలుకానున్నది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఎలా జరుగుతుంది? టీకాలు తొలుత ఎవరికిస్తారు? ఏవిధంగా రిజిస్టర్‌ చేసుకోవాలి? తదితర ప్రశ్నలకు సమాధానాలు ..

తొలుత ఎవరికి?

మహమ్మారిపై ముందుండి పోరాడిన 3 కోట్ల మంది వైద్య, ఆరోగ్య సిబ్బందికి తొలుత టీకా అందిస్తారు. అనంతరం పోలీసులు, సాయుధ బలగాలు, మున్సిపల్‌ వర్కర్లు, హోంగార్డులు.. తదితర ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు వ్యాక్సిన్‌ వేస్తారు. ఆ తర్వాత  50 ఏండ్లుపైబడినవారికి, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న 50 ఏండ్ల్లలోపువారికి ప్రాధాన్యమిస్తారు. 

రిజిస్ట్రేషన్‌ ఎలా?

వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కోసం కొ-విన్‌ పేరిట డిజిటల్‌ వేదికను ప్రభుత్వం రూపొందించింది.యాప్‌ను కూడా అందుబాటులోకి తేనుంది. ఇప్పటికే ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల సమాచారాన్ని కొ-విన్‌లో నమోదుచేశారు. టీకా కోసం కొ-విన్‌లో నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు ప్రభుత్వం జారీచేసిన ఐడీకార్డు/ ఆధార్‌ను అప్‌లోడ్‌ చేయాలి. అనంతరం వ్యాక్సిన్‌ వేసే తేదీ, వేదిక వివరాలతో మొబైల్‌కు సందేశం వస్తుంది. 

వ్యాక్సినేషన్‌ ఎలా?

రిజిస్టర్‌ చేసుకున్న వారు నిర్దేశిత సమయానికి కేటాయించిన వేదిక వద్దకు వెళ్లి టీకా వేసుకోవాలి. అనంతరం 30 నిమిషాలపాటు అబ్జరేషన్‌ రూమ్‌లో ఉంచుతారు. 

ఎప్పుడు, ఎక్కడ వేస్తారు?

దవాఖానలు, వైద్య కేంద్రాలతోపాటు పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లలోనూ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జరుగుతుంది. మారుమూల ప్రాంతాలవారికి మొబైల్‌ టీమ్‌ల ద్వారా టీకాలు అందిస్తారు.