బుధవారం 25 నవంబర్ 2020
National - Oct 21, 2020 , 03:08:32

ఆరోగ్య సిబ్బందికే తొలి టీకా

ఆరోగ్య సిబ్బందికే తొలి టీకా

  • డాటా సిద్ధం చేయాలని నోడల్‌ అధికారులకు 
  • కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లేఖ

న్యూఢిల్లీ: కరోనా టీకా అందుబాటులోకి రాగానే మొదట వైద్యులు, వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలకే వేయాలని కేంద్రప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్నది. దీనికోసం సిబ్బంది సమాచారాన్ని సేకరించి కొవిడ్‌ వ్యాక్సిన్‌ బెనిఫిషియరీ మేనేజ్‌మెంట్‌ సిస్టంలో అప్‌లోడ్‌ చేయాలని జిల్లా, రాష్ట్రస్థాయి నోడల్‌ అధికారులకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌భూషణ్‌ లేఖ రాశారు. ఏఎన్‌ఏంలు, ఆశా కార్యకర్తలు, నర్సులు, సూపర్‌వైజర్లు, మెడికల్‌ ఆఫీసర్లు, వైద్యులు, వైద్య కళాశాలల్లోని ఫ్రొఫెసర్లు-విద్యార్థులు, ఆయుష్‌ వైద్యులకు మొదటగా, తర్వాత పారామెడికల్‌ సిబ్బంది, ఫార్మసిస్టులు, ఫిజియోథెరపిస్టులు, రేడియాలజిస్టులు, వార్డు బాయ్‌లు, శాస్త్రవేత్తలకు టీకాలు వేస్తారు. ఆ తర్వాత అంబులెన్స్‌ డ్రైవర్లు, పారిశుద్ధ్య, సెక్యూరిటీ సిబ్బందికి టీకాలు వేయనున్నారు. 

వివరాలు సేకరించాలి

ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో ఉండే డాక్టర్లు, నర్సులు, ఇతర సహాయ సిబ్బంది ఆరోగ్య వివరాలు, ఇతర సమచారాన్ని 31 లోపు సేకరించాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ కమిషనర్‌ వాకాటి కరుణ మంగళవారం జిల్లాల అధికారులను ఆదేశించారు.