బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 21:36:08

ఆ మూడు కొవిడ్‌ టీకాలపైనే ఆశలు..

ఆ మూడు కొవిడ్‌ టీకాలపైనే ఆశలు..

న్యూ ఢిల్లీ: ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్నది కొవిడ్‌ టీకాల కోసమే. ఎన్నో దేశాలు, కంపెనీలు వ్యాక్సిన్‌ అభివృద్ధికి నడుంబిగించాయి. అయితే, ప్రస్తుతం కేవలం మూడు దేశాలకు చెందిన టీకాలు మాత్రమే క్లినికల్‌ ట్రయల్స్‌ మూడో దశలో ఉన్నాయి. యూఎస్‌ఏ, యూకే (యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్‌ టీకా), చైనా తయారుచేసిన వ్యాక్సిన్లు మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

24 కొవిడ్‌ వ్యాక్సిన్‌లు ప్రస్తుతం క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభ దశలో ఉండగా, 141 టీకాలు ఇంకా ఆ దశకు చేరుకోలేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేకక అధికారి రాజేశ్‌భూషణ్‌ వెల్లడించారు. మూడో దశ క్లినికల్‌ట్రయల్స్‌ విజయవంతమైతే కంపెనీలు సంబంధిత రెగ్యులేటరీ అనుమతి తీసుకొని, టీకాలను తయారుచేస్తాయని వివరించారు. మన దేశంలో రెండు టీకాలు క్లినికల్‌ ట్రయల్స్‌ దశలో ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం రెండోదశ ట్రయల్స్‌ నడుస్తున్నదని చెప్పారు. ఒక టీకా ఎనిమిది సైట్లలో 1,150 మందిపై ప్రయోగించగా, మరో టీకాను 1,000 మందిపై పరీక్షిస్తున్నట్లు వివరించారు. 

భారత్‌ది కీలకపాత్ర..

‘ఇండియా వ్యాక్సిన్‌ తయారీ కేంద్రంగా ఉన్నందున కీలక పాత్ర పోషించనుంది. ఇక వ్యాక్సిన్‌ పంపిణీ విషయానికొస్తే అది రెండు పద్ధతుల్లో జరుగుతుంది.  మొదట అంతర్జాతీయ ఏజెన్సీలు వ్యాక్సిన్‌ తయారీ, పంపిణీ చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. రెండోది టీకా విజయవంతమైన వ్యక్తులతో దేశాలు వ్యక్తిగతంగా సంప్రదింపులు జరపాలి.’ అని రాజేశ్‌ భూషణ్‌ వ్యాఖ్యానించారు. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇందుకోసం యాక్సెస్‌ టు కొవిడ్‌ 19 టూల్స్‌ యాక్సిలరేటర్‌ (ఏసీటీ) అనే ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు. ఇది ప్రపంచ దేశాలకు టీకాలు, డయాగ్నోస్టిక్‌ కిట్లు, మందులు ఎలా అందించాలనేదానిపై కసరత్తు చేస్తుందన్నారు.

అలాగే, ఏసీటీ కింద కొవాక్స్‌ అనే సౌకర్యం కూడా ఏర్పాటు చేసిందన్నారు. ఇందులో డబ్ల్యూహెచ్‌వో కాకుండా జీఏవీఐ (టీకా, రోగనిరోధకత కోసం గ్లోబల్‌ అలయన్స్‌), సీఈపీఐ(కొయిలిషన్‌ ఫర్‌ ఎపిడెమిక్‌ ప్రిపేడ్‌నెస్‌ ఇన్నోవేషన్‌) ఇందులో పాలుపంచుకుంటున్నాయని పేర్కొన్నారు. భారత్‌ ఈ రెండు సంస్థల్లోనూ ప్రముఖ పాత్ర పోషిస్తున్నదని వివరించారు. దీంతో మన దేశానికి అన్ని దేశాలతో టీకా కోసం సంప్రదింపులు జరిపే అవకాశం ఉంటుందన్నారు. ఇప్పటి వరకూ వ్యాక్సిన్‌ కోసం ఏ కంపెనీతోనూ మనదేశం ఒప్పందం చేసుకోలేదని స్పష్టం చేశారు.  కానీ, టీకా అందుబాటులోకి వస్తే దేశంలోని ప్రజలందరికీ అందేలా ఎలా చూడడం అనే అంశంపై పలు స్టాక్‌హోల్డర్లలతో కేంద్రం చర్చిస్తూనే ఉందన్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo