మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 17:09:51

దవాఖానలతో అనుసంధానించిన హోటళ్లను తొలగించండి : కేజ్రీవాల్

దవాఖానలతో అనుసంధానించిన హోటళ్లను తొలగించండి : కేజ్రీవాల్

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో కొవిడ్-19 పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోంది. ఢిల్లీ నగరంలోని దవాఖానలతో అనుసంధానం చేసిన హోటళ్లను తొలగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఢిల్లీలోని అతిపెద్ద దవాఖానలో ఒక్క కొవిడ్ మరణం సంభవించకపోవడం పట్ల సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంతోషం వ్యక్తం  చేశారు.

"కొవిడ్ పడకల సంఖ్యను పెంచడానికి కొన్ని హోటళ్ళను దవాఖానలకు జతచేశారు. గత చాలా రోజులుగా అభివృద్ధి చెందుతున్న పరిస్థితుల కారణంగా అన్ని హోటల్ పడకలు ఖాళీగా ఉన్నాయి. దాంతో ఈ హోటళ్ళను విడుదల చేయండి" అని కేజ్రీవాల్ బుధవారం ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. యాంటిజెన్ పరీక్ష ప్రతికూలంగా ఉన్నప్పటికీ లక్షణాలు ఉన్న రోగులపై ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు తప్పనిసరిగా జరగాలని మరో ట్వీట్లో కేజ్రీవాల్ చెప్పారు. "ఈ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని నేను ఈ రోజు అధికారులను ఆదేశించాను" అని కేజ్రీవాల్ తెలిపారు.

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, ఢిల్లీలో మంగళవారం కంటే 107 కేసులు తక్కువగా నమోదయ్యాయి. దేశ రాజధానిలో మొత్తం డిశ్చార్జ్ అయిన రోగుల సంఖ్య 1.17 లక్షలకు చేరింది. ఇక్కడ ఇప్పటివరకు 3,881 మరణాలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 28 మరణించినట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ లెక్కలు చెప్తున్నాయి. లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ హాస్పిటల్ లో సోమవారం ఎటువంటి మరణాలు నమోదు కాలేదని కేజ్రీవాల్ మంగళవారం చెప్పారు. "నిన్న మా అతిపెద్ద దవాఖానలో కొవిడ్-19 మరణం లేదు" అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. దీనికి ప్రతిస్పందనగా బీజేపీ ఐటీ సెల్ ఇన్‌చార్జ్ అమిత్ మాల్వియా.. హోంమంత్రి అమిత్ షా పర్యటన తర్వాతే ఎల్‌ఎన్‌జేపీలో పరిస్థితులు మెరుగుపడటం ప్రారంభించాయని పేర్కొన్నారు.


logo