సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 17, 2020 , 13:51:03

దేశంలో 63.33 శాతానికి చేరుకున్న కోవిడ్‌-19 రికవరీ రేటు

దేశంలో 63.33 శాతానికి చేరుకున్న కోవిడ్‌-19 రికవరీ రేటు

ఢిల్లీ : దేశంలో ఇప్పటివరకు కరోనా వైరస్ భారిన పడిన వారిలో మొత్తం 6 లక్షల 35 వేల 757 మంది  కోలుకున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం పేర్కొంది. దీంతో రికవరీ రేటు 63.33 శాతానికి చేరుకుందని ప్రభుత్వం ఈ రోజు తెలిపింది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 22 వేల 942 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన‌ట్లు వెల్ల‌డించింది. దేశంలో ప్ర‌స్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3 లక్షల 42 వేల 473 గా ఉంది.

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ... గ‌డిచిన 24 గంట‌ల్లో దేశంలో నూత‌నంగా 34 వేల 956 కోవిడ్‌-19 కేసులు న‌మోదు అయిన‌ట్లు తెలిపింది. కొత్త కేసుల‌తో క‌లుపుకుని కోవిడ్ కేసుల సంఖ్య ఒక మిలియన్ మార్కును దాటిన‌ట్లు పేర్కొంది. ఒక్క‌ రోజులోనే దేశంలో 687 మరణాలు సంభ‌వించాయి. వీటితో క‌లుపుకుని కోవిడ్‌-19 కార‌ణంగా దేశవ్యాప్తంగా మృతుల సంఖ్య 25 వేల 602 కు చేరుకుంది. 

ఇదిలావుండగా గ‌డిచిన 24 గంట‌ల్లో వివిధ ల్యాబ్‌ల్లో 33 వేల 228 కరోనా వైరస్ నమూనాలను ప‌రీక్షించిన‌ట్లు ఐసీఎంఆర్ తెలిపింది. దేశంలో కోవిడ్ -19 వ్యాప్తి చెందిన తరువాత ఒకే రోజులో ప్రయోగశాలల్లో ఇంత పెద్ద మొత్తంలో ప‌రీక్ష‌లు నిర్వ‌హించడం ఇదే తొలిసారి అని వెల్ల‌డించింది. ఇప్పటివరకు ఒక కోటి 30 లక్షల 72 వేల 718 పరీక్షలు జరిగాయంది. ప్రస్తుతం  దేశ వ్యాప్తంగా 880 ప్రభుత్వ ప్రయోగశాలలు, 364 ప్రైవేట్ ప్రయోగశాల‌లు క‌లుపుకుని  మొత్తం వెయ్యి 244 ప్రయోగశాలలు  కోవిడ్ -19 పరీక్షల‌ను నిర్వహిస్తున్నాయని ఐసీఎంఆర్ తెలిపింది.


logo