సోమవారం 30 నవంబర్ 2020
National - Nov 11, 2020 , 14:24:57

92.79 శాతానికి చేరిక కరోనా రికవరీ రేటు

92.79 శాతానికి చేరిక కరోనా రికవరీ రేటు

న్యూఢిల్లీ : దేశంలో కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు బుధవారం 86లక్షల మార్క్‌ను దాటాయి. ఇందులో ఇప్పటి వరకు 80.13లక్షల మంది కోలుకోగా జాతీయ రికవరీ ఏటు 92.79శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. గడిచిన 24గంటల్లో 44,281 మంది కరోనా పాజిటివ్‌గా పరీక్షించడం మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 86,36,011కి పెరిగింది. కొత్తగా 512 మంది మరణించగా.. మృతుల సంఖ్య 1,27,571కి చేరిందని మంత్రిత్వశాఖ చెప్పింది. ప్రస్తుతం పాజిటివ్‌ కేసుల సంఖ్య ఐదు లక్షల కన్నా తక్కువగా ఉన్నాయని, 4,94,657 క్రియాశీల కేసులు ఉన్నాయని, కేస్‌లోడ్‌లో 5.73శాతమని తెలిపింది. ఇప్పటి వరకు 80,13,783 మంది కోలుకోగా రికవరీ రేటు 92.79 శాతానికి పెరగ్గా.. కొవిడ్‌ మరణాల రేటు 1.48శాతంగా ఉందని మంత్రిత్వశాఖ వివరించింది.


దేశంలో కొవిడ్‌ కేసుల సంఖ్య ఆగస్ట్‌ 7న 20లక్షలు, ఆగస్ట్‌ 23న 30లక్షలు, సెప్టెంబర్‌ 5న 40లక్షల మార్క్‌ను దాటాయి. సెప్టెంబర్ 16న 50లక్షలు, సెప్టెంబర్ 28న 60లక్షలు, అక్టోబర్ 11న 70లక్షలు, అక్టోబర్ 29న నాటికి 80లక్షలు దాటాయి. ఇదిలా ఉండగా.. ఇప్పటి వరకు 12.07కోట్లకుపైగా కొవిడ్‌ శాంపిల్స్‌ పరీక్షించినట్లు ఇండియన్స్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) వివరించింది. అలాగే దేశంలో ఇప్పటి వరకు నమోదైన 1,27,571 కరోనా మరణాల్లో మహారాష్ట్రలో 45,435 మంది, కర్ణాటకలో 11,430, తమిళనాడులో 11,387, పశ్చిమ బెంగాల్‌లో 7,403, ఉత్తరప్రదేశ్‌లో 7,261, ఢిల్లీలో 7,143, ఆంధ్రప్రదేశ్‌లో 6,814, పంజాబ్‌లో 4,358, గుజరాత్‌లో 3,370 మంది మృత్యువాతపడ్డారని చెప్పింది. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.