మంగళవారం 14 జూలై 2020
National - Jun 28, 2020 , 01:03:50

ఆరు రోజుల్లోనే లక్ష

ఆరు రోజుల్లోనే లక్ష

  • దేశంలో 5 లక్షలు దాటిన కరోనా కేసులు
  • తొలి లక్షకు 110 రోజులు పట్టగా, తర్వాతి 4 లక్షలకు కేవలం 39 రోజులే
  • 15,685కు చేరుకున్న మృతుల సంఖ్య

న్యూఢిల్లీ, జూన్‌ 27: దేశంలో కరోనా ఉద్ధృతి అంతకంతకూ తీవ్రమవుతున్నది. కేవలం గత ఆరు రోజుల్లోనే లక్షకుపైగా కేసులు నమోదయ్యాయి. శనివారం రికార్డు స్థాయిలో 18,552 కేసులు నమోదుకాగా, 384 మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో మొత్తం కేసులు 5 లక్షలు (5,08,953 కేసులు) దాటాయి. మృతుల సంఖ్య 15,685కు చేరుకున్నది. 15,000కు పైగా కేసులు నమోదుకావడం వరుసగా ఇది నాలుగో రోజు. దేశంలో లక్ష కేసులు చేరుకోవడానికి 110 రోజులు పట్టగా, ఆ తర్వాత 39 రోజుల్లోనే అదనంగా 4లక్షల కేసులు నమోదయ్యాయి. జూన్‌ 1 నుంచి 27వ తేదీ మధ్యనే దాదాపు 3,18,418 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 1,97,387 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటికే 2,95,880 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో రికవరీ రేటు 58.13 శాతంగా నమోదైంది. శుక్రవారం నాటికి దేశవ్యాప్తంగా 79,96,707 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) వెల్లడించింది. ఇటీవలి కాలంలో పరీక్షల సంఖ్య పెంచడం కూడా కేసుల పెరుగుదలకు ఒక కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.  

8 రాష్ర్టాల్లోనే 85.5 శాతం కేసులు

దేశంలో కేవలం ఎనిమిది రాష్ర్టాల్లోనే (మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ) 85.5 శాతం కేసులు, 87 శాతం మరణాలు నమోదైనట్లు కేంద్ర వైద్య శాఖ వెల్లడించింది. దేశంలో కరోనా పరిస్థితులపై శనివారం కేంద్ర మంత్రుల బృందానికి ఈ మేరకు వివరించింది. ప్రజారోగ్య నిపుణులు, సాంక్రమిక వ్యాధి నిపుణులు, సీనియర్‌ జాయింట్‌ సెక్రటరీ స్థాయి అధికారితో కూడిన 15 కేంద్ర బృందాలు కరోనా కట్టడికి ఆయా రాష్ర్టాలకు సహకారం అందిస్తున్నాయని తెలిపింది. ప్రస్తుతం మరో కేంద్ర బృందం మహారాష్ట్ర, గుజరాత్‌, తెలంగాణలలో పర్యటిస్తున్నట్లు పేర్కొంది. రికవరీ, మరణాల శాతం, కేసుల రెట్టింపు, కరోనా పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని మంత్రులకు వివరించింది. 

దేశంలో కేసుల పెరుగుదల

జనవరి 30:
తొలి కేసు
మే 19:
లక్ష 
జూన్‌ 3:  
2 లక్షలు
జూన్‌ 13:  
3 లక్షలు
జూన్‌ 21:  
4 లక్షలు
జూన్‌ 27:  
5 లక్షలు


logo