సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 03:06:32

వైరస్‌ మళ్లీ మళ్లీ సోకదు!

వైరస్‌ మళ్లీ మళ్లీ సోకదు!

  • శరీరంలో మిగిలి ఉంటేనే మళ్లీ పాజిటివ్‌ 
  • టెస్టుల ఫలితాలు తారుమారైన కేసులున్నాయి
  • వైరస్‌ యాంటీబాడీల శక్తి తగ్గడం మామూలే
  • కరోనాకు హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధ్యమే
  • భరోసానిస్తున్న వైద్య నిపుణులు

న్యూఢిల్లీ: కరోనా సోకి వ్యాధి నయమైన వారికి కూడా మళ్లీ కొవిడ్‌ వస్తుందన్న వార్తలు చాలా మందిలో ఆందోళన కలిగిస్తున్నాయి. అదే సమయంలో వైరస్‌ ప్రతినిరోధకాలు(యాంటీబాడీలు) శరీరంలో రెండు నెలలకు మించి ఉండవన్న అధ్యయనాలు ఈ ఆందోళనను మరింత పెంచుతున్నాయి. ఇలాగైతే సామూహిక రోగనిరోధక శక్తి(హెర్డ్‌ ఇమ్యూనిటీ) కష్టమేనన్న భయం పెరుగుతున్నది. అయితే వైరస్‌లు స్వల్ప వ్యవధిలో మళ్లీ మళ్లీ సోకడం అత్యంత అరుదుగా జరుగుతుందని పలువురు ఎపిడమాలజిస్టులు చెప్తున్నారు. కరోనా వైరస్‌ కూడా ఇంతకుముందు వెలుగుచూసిన వైరస్‌ల్లాగానే వ్యవహరిస్తున్నదని, టీకా ద్వారా హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధ్యమేనని భరోసానిస్తున్నారు. యాంటీబాడీలు రెండు మూడు నెలల తర్వాత శక్తిని కోల్పోవడం సహజమేనని హార్వర్డ్‌ వర్సిటీకి చెందిన ప్రముఖ ఇమ్యునాలజిస్టు మైకేల్‌ మీనా తెలిపారు. వైరస్‌తో పోరాడేది కేవలం యాంటీబాడీలు మాత్రమే కాదని గుర్తు చేశారు. టీ సెల్స్‌ వైరస్‌తో సమర్థంగా పోరాడుతాయని యేల్‌ వర్సిటీ వైద్య నిపుణులు అకికో ఇవసాకీ తెలిపారు. చాలా మందిలో వ్యాధి లక్షణాలు తగ్గినప్పటికీ వైరస్‌ శరీరంలోనే ఉండిపోవచ్చని, రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు అది తిరిగి దాడి చేసే అవకాశం ఉన్నదని వైద్య నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా పరీక్షల్లో ఫలితాలు తారుమారు అయిన సందర్భాలు కూడా ఉన్నాయని గుర్తు చేశారు. అందువల్లే కొంత మందిలో మళ్లీ పాజిటివ్‌ వస్తున్నట్టు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఉన్న రకరకాల ఇన్ఫెక్షన్లకు కారణమైన వైరస్‌ల వల్ల చాలా మందిలో కరోనాను తట్టుకొనే ఇమ్యూనిటీ ఉంటున్నదని సింగపూర్‌లోని డ్యూక్‌ ఎస్‌యూఎస్‌ మెడికల్‌ స్కూల్‌ వైరాలజిస్టు ఆంటోనియో బెర్టోలెట్టి తెలిపారు. 


logo