బుధవారం 08 జూలై 2020
National - Jun 29, 2020 , 18:54:05

తీహార్‌ జైలు అధికారులకు ఢిల్లీ కోర్టు నోటీసులు

తీహార్‌ జైలు అధికారులకు ఢిల్లీ కోర్టు నోటీసులు

న్యూ ఢిల్లీ: ఢిల్లీ కోర్టు సోమవారం తీహార్ జైలు అధికారులకు నోటీసు జారీ చేసింది. కశ్మీర్‌లోని ప్రధాన వేర్పాటువాద నాయకుల్లో ఒకరైన షబ్బీర్ షా కొవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో తనకు జైలులో ప్రత్యేక సెల్ కావాలని కోర్టును ఆశ్రయించాడు. కాగా, ఈ విషయంపై జూలై 1 లోగా తమ స్పందనను దాఖలు చేయాలని స్పెషల్ జడ్జి ధర్మేంద్ర రానా జైలు అధికారులను సోమవారం ఆదేశించారు. పాటియాలాహౌస్ కోర్టులో న్యాయవాదులు ఎంఎస్ ఖాన్, క్వాసర్ ఖాన్ల ద్వారా షా దరఖాస్తు పెట్టుకున్నాడు.  షా   గుండె జబ్బుతో సహా వివిధ వ్యాధులతో షా బాధపడుతున్నాడని, అతడి రోగనిరోధక శక్తి కూడా చాలా తక్కువగా ఉందని అందులో పేర్కొన్నారు. ఇవి అతడిని కొవిడ్‌-19 బారిన పడేలా చేస్తాయని న్యాయవాదులు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో అతడికి సరైన చికిత్స, జైలులో ఒక ప్రత్యేక సెల్‌ను కేటాయించాలని కోరారు.  అంటువ్యాధుల విషయంలో తాత్కాలిక వసతి కల్పించేందుకు జైలు మాన్యువల్‌లో నిబంధన ఉందని పేర్కొన్నారు. 

కాగా, రెండు వేర్వేరు కేసుల్లో షా ప్రస్తుతం తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. 2005లో టెర్రర్ ఫైనాన్సింగ్ కోసం  మనీలాండరింగ్‌కు పాల్పడ్డాడని 2007లో అతడిపై మొదటి కేసు నమోదైంది. 2005 కేసుకు సంబంధించి జూలై 25, 2017న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అతడిని అరెస్టు చేసింది. మరొక కేసులో, 2008 ముంబై ఉగ్రవాద దాడికి సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జమాఅత్-ఉద్-దావా చీఫ్ హఫీజ్ సయీద్ పాల్గొన్న ప్రత్యేక ఉగ్రవాద నిధుల కేసు దర్యాప్తుకు సంబంధించి జూన్ 2019లో షాను ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుంది. 26/11 ముంబై ఉగ్రవాద దాడి సూత్రధారి హఫీజ్ సయీద్‌తో సంబంధం ఉన్న ఈ కేసుకు సంబంధించి షా, మస్రత్ ఆలం, ఆసియా ఆండ్రాబీలతో సహా పలు వేర్పాటువాద నాయకులు జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు.logo