సోమవారం 18 జనవరి 2021
National - Dec 24, 2020 , 13:25:37

‘కొవాగ్జిన్‌’తో ఏడాది వరకు యాంటీబాడీలు : భారత్‌ బయోటెక్‌

‘కొవాగ్జిన్‌’తో ఏడాది వరకు యాంటీబాడీలు : భారత్‌ బయోటెక్‌

హైదరాబాద్‌ : కరోనా మహమ్మారి నేపథ్యంలో  హైదరాబాద్‌కు చెందిన ఫార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్‌ కంపెనీ ‘కొవాగ్జిన్‌’ పేరుతో రూపొందిస్తున్న వ్యాక్సిన్‌ రోగ నిరోధకత ప్రతి స్పందనలను ప్రేరేపించిందని, తీవ్రమైన ప్రతికూల సంఘటనలు ఏవీ లేవని తేలింది. టీకాతో ఆరు నెలల నుంచి 12 నెలల వరకు యాంటీబాడీలు ఉత్పత్తి చేయగలదని అంచనా వేస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఈ మేరకు కొవాగ్జిన్‌ టీకాపై ఓ వెబ్‌సైట్‌ పరిశోధన పత్రాన్ని విడుదల చేసింది. ఫేజ్‌-1 క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా కొవాగ్జిన్‌ తీసుకున్న వలంటీర్లలో మూడు నెలల తర్వాత ఇలాంటి సానుకూల ఫలితాలను శాస్త్రవేత్తలు గుర్తించినట్లు పేర్కొంది. ఫేజ్‌-2 క్లినికల్‌ ట్రయల్స్ ఫలితాల ప్రకారం ఈ టీకా సమర్థవంతమైందని నిర్ధారణ అయినట్టు వివరించింది. భారత్‌ బయోటెక్‌ వ్యాక్సిన్‌ మూడో విడత ట్రయల్స్‌ ఇప్పటికే ప్రారంభించింది. అత్యవసర వినియోగ అధికారం కోసం కంపెనీ దరఖాస్తు చేయగా.. సబ్జెక్ట్ నిపుణుల ప్యానెల్ పరిశీలిస్తోంది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించి డేటాను సమర్పించాలని నిపుణుల కమిటీ కోరింది.


భారత్‌ బయోటెక్‌ టీకా అత్యవసర వినియోగ అధికారాన్ని కోరుతూ మొదటి, రెండో విడత ట్రయల్స్‌ మధ్యంతర భద్రత, ఇమ్యునోజెనిసిటీ డేటాను సమర్పించింది. టీకా రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ తొమ్మిది రాష్ట్రాల్లోని తొమ్మిది హాస్పిటల్స్‌లో జరిగాయి. ట్రయల్స్‌లో భాగంగా 380 మంది ఆరోగ్యవంతులైన చిన్న పిల్లలు, పెద్దవాళ్లను రెండు బృందాలుగా విభజించారు. ఒక బృందానికి ఎక్కువ మోతాదులో, రెండో బృందానికి తక్కువ మోతాదులో టీకా అందజేశారు. అనంతరం ఫలితాలను పరిశీలించగా.. టీకా తీసుకున్న రెండు బృందాల్లోనూ ప్రభావవంతంగా పనిచేసినట్టు కనిపించింది. రెండు డోసుల టీకా ఇచ్చిన తర్వాత ‘దుష్ప్రభావాలు’ నామమాత్రంగా ఉన్నాయని, తీవ్రమైన ఇబ్బందులు కాలేదని పరిశోధకులు తెలిపారు. వ్యాక్సిన్‌ ఆరు నుంచి 12 నెలల పాటు యాంటీబాడీలను ఉత్పత్తి చేయగలదని అంచనా వేస్తున్నట్లు భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌పై పరిశోధన పత్రం పేర్కొంది. భారత్‌ బయోటెక్‌ కంపెనీ నేషన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ, ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) సహకారంతో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది.