ఆదివారం 29 నవంబర్ 2020
National - Oct 24, 2020 , 13:18:49

అత్యవసరమైతే డిసెంబర్‌లోనే ‘కొవాగ్జిన్‌’?

అత్యవసరమైతే డిసెంబర్‌లోనే ‘కొవాగ్జిన్‌’?

హైదరాబాద్‌ : దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది.. ఇప్పటికే నిత్యం 50వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. శీతాకాలం నేపథ్యంలో మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం హెచ్చరిస్తోంది. దేశంలో ప్రస్తుతం మూడు వ్యాక్సిన్‌లో కీలక దశలో ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ సంస్థ ‘కొవాగ్జిన్‌’, పూణేకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్‌, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కొవిషీల్డ్‌, రష్యా టీకా స్పుత్నిక్‌ వీ క్లినికల్‌ ట్రయల్స్‌ కొనసాగుతున్నాయి. భారత్‌ బయోటెక్‌ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ) భాగస్వామ్యంతో భారత్‌ బయోటెక్‌, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ సంస్థ (ఐసీఎంఆర్‌) సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కొవిడ్‌-19 టీకాను అభివృద్ధి చేస్తోంది. ఈ సంస్థ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ వచ్చే నెలలో ప్రారంభంకానున్నాయి. 

మూడో విడతలో 26వేల మందిపై ప్రయోగం..

దేశవ్యాప్తంగా 25 ప్రాంతాల్లో 26వేల మంది వలంటీర్లపై టీకాను పరీక్షించేందుకు ఏర్పాటు చేస్తోంది. మొదటి, రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతం కావడంతో ‘కొవాగ్జిన్‌’ మూడో దశ మానవ పరీక్షలకు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) శుక్రవారం భారత్‌ బయోటెక్‌కు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల సమాచారాన్ని పరిశీలించిన సబ్జెక్ట్‌ నిపుణుల కమిటీ తుది విడత ట్రయల్స్‌కు అనుమతి ఇచ్చింది. పరీక్షలు నవంబర్‌లో మొదలైతే వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి పూర్తికానున్నాయి. దేశంలో ఇంత పెద్ద ఎత్తున మూడో విడత ట్రయల్స్‌ నిర్వహిస్తున్న టీకా ‘కొవాగ్జిన్‌’ కావడం విశేషం. అయితే త్వరలో మూడో విడత ట్రయల్స్‌ ప్రారంభంకానున్న నేపథ్యంలో టీకా దేశంలో త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. పరీక్షలు విజయవంతమైతే వచ్చే సంవత్సరం ఏప్రిల్‌, మేలో టీకా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

కేంద్రం అనుమతి ఇస్తే ముందస్తుగానే..

రాబోయే రోజుల్లో కేసుల ఉధృతి పెరిగితే ఒక వేళ అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తే అంతకంటే ముందే డిసెంబర్‌, జనవరిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రష్యాతో పాటు చైనా దేశాలు చొరవ తీసుకొని మూడో విడత ట్రయల్స్‌కు ముందే వ్యాక్సిన్‌ పంపిణీకి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల్లో ‘కొవాగ్జిన్‌’ సురక్షితమని తేలింది. రీసస్‌ కోతులపై కూడా ప్రయోగాలు జరుపగా టీకా యాంటీబాడీలు వృద్ధి చేసినట్లు తేలింది. ఈ పరీక్షల ఆధారంగా భారత్‌ బయోటెక్‌ వ్యాక్సిన్‌కు అత్యవసర అనుమతి ఇచ్చే అంశాన్ని కేంద్రం పరిగణలోకి తీసుకోవచ్చు. ఇప్పటికే కేంద్రం ఈ ఏడాది డిసెంబర్‌ వరకు టీకా అందుబాటుకి వస్తుందని చెబుతున్న విషయం ప్రస్తావనార్హం. వ్యాక్సిన్‌ పంపిణీకి అనుమతి ఇస్తే తొలి విడతలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా ఉన్న వైద్యులు, నర్సులు, అత్యసవర సేవల్లో నిమగ్నమైన సిబ్బంది, టీచర్లతో పాటు పలు రంగాల వారికి ఇచ్చే వీలుంది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.