శనివారం 06 మార్చి 2021
National - Jan 23, 2021 , 01:34:46

‘కొవాగ్జిన్‌' తొలి దశ ట్రయల్స్‌.. లాన్సెట్‌లో అధ్యయనం

‘కొవాగ్జిన్‌' తొలి దశ ట్రయల్స్‌.. లాన్సెట్‌లో అధ్యయనం

  • రోగనిరోధక శక్తిని పెంచుతుంది
  • తొలి దశ ట్రయల్స్‌పై లాన్సెట్‌లో అధ్యయనం
  • గర్వకారణమన్న భారత్‌ బయోటెక్‌ జేఎండీ 

న్యూఢిల్లీ, జనవరి 22: కరోనా కట్టడికి దేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి వ్యాక్సిన్‌ ‘కొవాగ్జిన్‌' సురక్షితమైనదేనని అంతర్జాతీయ వైద్య జర్నల్‌ ‘లాన్సెట్‌'లో ఓ అధ్యయనం ప్రచురితమైంది. టీకా వేసుకున్న వలంటీర్లు సమర్థంగా వైరస్‌ను తట్టుకున్నారని ఆ అధ్యయనం పేర్కొంది. ఈ మేరకు ‘కొవాగ్జిన్‌' తొలిదశ ట్రయల్స్‌ ఫలితాలపై నిర్వహించిన అధ్యయనం వివరాలను ‘లాన్సెట్‌' ప్రచురించింది. టీకా వల్ల వలంటీర్లలో రోగనిరోధక శక్తి మెరుగైందని, కొందరిలో మాత్రం స్వల్ప స్థాయిలో దుష్ప్రభావాలు తలెత్తినట్లు తెలిపింది. ప్రతికూల ప్రభావానికి సంబంధించి ఒక కేసు నమోదైనప్పటికీ.. దానికి టీకా కారణం కాదని నిర్ధారణ అయినట్లు పేర్కొంది. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ)-పుణె సహకారంతో హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ సంస్థ ‘కొవాగ్జిన్‌' టీకాను  అభివృద్ధి చేసింది. కాగా ‘కొవాగ్జిన్‌' టీకా అత్యవసర వినియోగానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మూడో దశ ట్రయల్స్‌ జరుగుతుండగా అత్యవసర వినియోగానికి ఎలా అనుమతులు మంజూరు చేస్తారని పలువురు విమర్శించారు. ఈ క్రమంలో టీకా సురక్షితత్వంపై ‘లాన్సెట్‌' ప్రకటన వెలువడటం గమనార్హం.

అంతర్జాతీయ ప్రమాణాలతో ముందుకు.. 

‘లాన్సెట్‌'లో తమ వ్యాక్సిన్‌ తొలిదశ ట్రయల్స్‌ అధ్యయన ఫలితాలు ప్రచురితమవటం పట్ల భారత్‌ బయోటెక్‌ జేఎండీ సుచిత్ర ఎల్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఫలితాల పట్ల ఎంతో గర్వపడుతున్నామని, అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ తమ ప్రయాణాన్ని కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కొవాగ్జిన్‌ మూడో దశ ట్రయల్స్‌లో భాగంగా 13వేల మంది వలంటీర్లకు రెండో డోసు అందించినట్లు వెల్లడించారు. 

భారత్‌ నుంచి బ్రెజిల్‌కు ‘సంజీవని’టీకా

న్యూఢిల్లీ: లక్ష్మణుడి ప్రాణాలు కాపాడటానికి హనుమంతుడు ద్రోణగిరి పర్వతం నుంచి సంజీవని తెచ్చాడు. భారతదేశం బ్రెజిల్‌కు కరోనా టీకాలు పంపించడంతో బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో రామాయణంలోని ఆ ఘట్టాన్ని గుర్తు చేసుకొన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ.. హనుమంతుడు కరోనా టీకాను భారత్‌ నుంచి బ్రెజిల్‌కు తీసుకువెళ్తున్నట్టుగా ఉన్న చిత్రాన్ని ట్వీట్‌ చేశారు. 

VIDEOS

logo