ఆదివారం 29 నవంబర్ 2020
National - Oct 23, 2020 , 07:05:25

మూడో దశ ‘కొవాగ్జిన్‌’ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతి

మూడో దశ ‘కొవాగ్జిన్‌’ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతి

హైదరాబాద్‌ : నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ) భాగస్వామ్యంతో భారత్‌ బయోటెక్‌, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ సంస్థ (ఐసీఎంఆర్‌) సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కొవిడ్‌-19 టీకా కొవాగ్జిన్‌. టీకా మూడో దశ ట్రయల్స్‌కు డ్రగ్స్‌ కంట్రోల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) అనుమతి లభించింది. తొలి రెండు విడుతల్లో ఆశాజనకమైన ఫలితాలు వచ్చాయి. దీంతో హైదరాబాద్‌కు చెందిన సంస్థ అక్టోబర్‌ 2న మూడో దశ ట్రయల్స్‌ కోసం దరఖాస్తు చేసింది.

సబ్జెక్ట్స్‌ ఎక్స్‌పర్ట్‌ కమిటీ టీకా అభ్యర్థికి మొదటి, రెండో విడుతల డేటాను పరిశీలించిన అనంతరం జంతువులపై ప్రయోగాలను అధ్యయనం కోసం సిఫారసు చేసింది. అలాగే అనుమానాస్పద కేసును ఎలా అంచనా వేయాలో, రోగ లక్షణం కేసుగా ఎలా వర్గీకరించాలనే దానిపై ప్రమాణాలకు సవరణలను ప్యానెల్‌ సూచించింది. భారత్‌ బయోటెక్‌ తుది ఆమోదం కోసం పూర్తి చేసిన ప్రోటోకాల్‌ను డీసీజీఐకి సమర్పించాల్సి ఉంటుంది. సంస్థ చేసిన దరఖాస్తులో ఢిల్లీ, ముంబై, పాట్నా, లక్నో, హైదరాబాద్‌ సహా పది రాష్ట్రాల్లోని 19 సైట్లలో ట్రయల్స్‌ నిర్వహించనున్నట్లు తెలిపింది.

18 సంవత్సరాలు పైబడిన వయస్సు గల 28,500 మందికి వ్యాక్సిన్‌ ఇవ్వాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. 28 రోజుల్లో రెండు మోతాదుల వ్యాక్సిన్‌ ప్రయోగాత్మకంగా ఇవ్వనున్నారు. గత నెలలో సంస్థ కొవిడ్‌-19 వైరస్‌కు కారణమైన సార్స్‌-కోవ్‌-2పై రీసస్‌ కోతులపై ప్రయోగాలు చేసింది. ఇందులో వ్యాక్సిన్‌ సురక్షితమైందని తేలింది. వ్యాక్సిన్‌ యాంటీబాడీలను ఉత్పత్తి చేసినట్లు గుర్తించినట్లు సంస్థ ప్రకటించింది.

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు దేశీయంగా అభివృద్ధి చేసిన టీకా కోవాగ్జిన్‌. ప్రస్తుతం డీసీజీఐ అనుమతి లభించడంతో త్వరలోనే మూడో విడత ట్రయల్స్‌ ప్రారంభం కానున్నాయి. కోవాగ్జిన్‌తో పాటు దేశంలో జైడస్‌ కాడిల్లా, ఆక్స్‌ఫర్డ్‌ విద్యాలయంతో ఆస్ట్రాజెనెకా టీకాలు క్లినికల్‌ ట్రయల్స్‌లో వివిధ దశల్లో ఉన్నాయి. గురువారం నాటికి దేశంలో కరోనా కేసులు 77,06,946 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. 1,16,616 మంది మహమ్మారి కారణంగా మృత్యువాతపడ్డారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.