మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 12:00:27

అలీబాబా గ్రూప్ ఫౌండర్ జాక్‌మాకు కోర్టు సమన్లు

అలీబాబా గ్రూప్ ఫౌండర్ జాక్‌మాకు కోర్టు సమన్లు

గురుగ్రామ్: చైనాకు చెందిన ఈ-కామర్స్ సంస్థ అలీబాబా గ్రూప్ ఫౌండర్ జాక్‌మాకు గురుగ్రామ్ కోర్టు సమన్లు జారీ చేసింది. కంపెనీ మాజీ ఉద్యోగి ఫిర్యాదు మేరకు ఈ చర్యలు చేపట్టింది. అలీబాబా సంస్థ‌కు చెందిన యూసీ న్యూస్ యాప్ ‌లో పుష్పేంద్ర పర్మార్ అనే వ్యక్తి గతంలో పని చేశారు. ఇటీవల యూసీ న్యూస్, యూసీ బ్రౌజర్ సహా 59 యాప్స్‌ను సెక్యూరిటీ కారణాలతో కేంద్రం నిషేధించిన విషయం తెలిసిందే. కంపెనీ యాప్స్, డాక్యుమెంట్స్‌లో సెన్సార్‌షిప్, ఫేక్ న్యూస్‌లపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో తనను చట్టవిరుద్ధంగా ఉద్యోగం నుంచి తొలగించారని ఆ కంపెనీకి చెందిన ఈ మాజీ ఉద్యోగి పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై గురుగ్రామ్ కోర్టు నోటీసులు జారీ చేసింది. చైనాకు వ్యతిరేకంగా ఉన్న వార్తలను ఆ కంపెనీ సెన్సార్ చేస్తున్నదని పేర్కొన్నారు. అలాగే యూసీ బ్రౌజర్, యూసీ న్యూస్‌లో తప్పుడు వార్తలు వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. 2000 నోట్లు రద్దు, భారత్-పాక్ మధ్య యుద్ధం తప్పు అంటూ ఫేక్ న్యూస్ ను యూసీ న్యూస్ పబ్లిష్ చేసిందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇండియా-చైనా సరిహద్దుకు సంబంధించిన వార్తలను కూడా సెన్సార్ చేసిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

చైనాతో పాటు డ్రాగన్ యాప్స్, యూసీ బ్రౌజర్, యూసీ న్యూస్‌లకు ప్రతికూలంగా ఉన్న కంటెంట్‌ను కంపెనీ సెన్సార్ చేసేదని, వీటిని సామాజిక, రాజకీయ గందరగోళానికి తావిచ్చేవిగా చూపేవని అన్నారు. వీటిపై తాను ప్రశ్నించడంతో తనను అకారణంగా తొలగించారని తెలిపారు. గురుగ్రామ్ జిల్లా కోర్టు సివిల్ జడ్జి సోనియా షికండ్ నోటీసులు జారీ చేశారు. జులై 29వ తేదీన అలీబాబా జాక్ మా సహా కంపెనీకి చెందిన పన్నెండుమంది అధికారులు కోర్టుకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. నెల రోజుల్లో రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ మేరకు జులై 20న సమన్లు జారీ అయ్యాయి.logo