గురువారం 04 జూన్ 2020
National - Apr 03, 2020 , 01:09:19

భారత్‌@2500

భారత్‌@2500

-ఒక్కరోజే 556 కొత్త కేసులు, 17 మంది కరోనాకు బలి

-మహారాష్ట్రలో 400దాటిన కేసులు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశంలో వేగంగా విజృభిస్తున్నది. గురువారం ఒక్కరోజే 556 కొత్త కేసులు, 17 మరణాలు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 2,507కు చేరిందని, మృతుల సంఖ్య 76కు పెరిగినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఢిల్లీలోని తబ్లిగీ జమాత్‌కు హాజరైన వారి ద్వారా దేశవ్యాప్తంగా 500 మందికిపైగా వైరస్‌ వ్యాపించినట్లు పేర్కొన్నది. ఆ కార్యక్రమంలో పాల్గొన్నవారి గుర్తింపు, నిర్ధారణ పరీక్షలు, వ్యాప్తి నిరోధక చర్యలపై యుద్ధప్రాతిపదికన స్పందించాలని కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శి బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని రాష్ర్టాల ముఖ్యకార్యదర్శులు, డీజీపీలకు సూచించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. మహారాష్ట్రలో కరోనా కేసులు 400 దాటాయి. కొత్తగా 81 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ సహా తెలంగాణ, తమిళనాడు, ఏపీ,  తదితర రాష్ర్టాల్లో తబ్లిగీ జమాత్‌ ప్రభావం స్పష్టం       కనిపించింది. మరింత మందికి పరీక్షలు నిర్వహిస్తుండటంతో కేసుల సంఖ్య పెరిగే అవకాశమున్నది. రూ. 1.5 కోట్ల విలువైన వ్యక్తిగత రక్షణ పరికరాలకు ఆర్డర్‌ ఇచ్చామని, వీటి సరఫరా మొదలైందని లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. దేశీయంగా ఎన్‌-95 మాస్కుల తయారీ ఊపందుకుందన్నా రు. వైద్యుల్లో కొందరికి వైరస్‌ సోకడంతో దవాఖానల్లో వైరస్‌ నియంత్రణ చర్యలను కచ్చితంగా పాటించాలని అధికారులు సూచించినట్లు వివరించారు. మరోవైపు ఎయిరిండియా విమానయాన సంస్థకు చెందిన ఎయిర్‌హోస్టెస్‌కు కరోనా సోకినట్టు తేలింది. ఆమె గతనెల 20న న్యూయార్క్‌ నుంచి ముంబైకి వచ్చిన విమానంలో సేవలు అందించారు.  ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు.

సీఆర్పీఎఫ్‌ వైద్యాధికారికి కరోనా 

ఢిల్లీకి చెందిన సీఆర్పీఎఫ్‌ వైద్యాధికారికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. సీఆర్‌పీఎఫ్‌కు చెందిన ఏడీజీ కార్యాలయంలో చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ హోదాలో పనిచేస్తున్న అతనికి హర్యానాలోని ఝజ్జర్‌లో ఉన్న ఎయిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు. అతనుండే దక్షిణ ఢిల్లీ సాకేత్‌ ప్రాంతంలోని సీఆర్పీఎఫ్‌ ట్రాన్సిట్‌ మెస్‌ను ప్రస్తుతం దిగ్బంధంలో ఉంచారు.

లాక్‌డౌన్‌ తర్వాతే అంతర్జాతీయ విమానాలు 

లాక్‌డౌన్‌ ఈ నెల 15న ముగిసిన తర్వాత అంతర్జాతీయ విమానాలకు అనుమతిస్తామని కేంద్ర ప్రభుత్వం గురువారం తెలిపింది. పౌర విమానయానశాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌పురి మాట్లాడుతూ.. విదేశాల్లో ఉన్న భారతీయులు దేశంలోకి రావడానికి లాక్‌డౌన్‌ ముగిసేవరకు వేచి ఉండాలని తెలిపారు.


logo