సోమవారం 25 జనవరి 2021
National - Dec 27, 2020 , 18:35:31

‘రష్యా మాదిరిగా దేశం కూడా ముక్కలవుతుంది..’

‘రష్యా మాదిరిగా దేశం కూడా ముక్కలవుతుంది..’

ముంబై: సోవియట్‌ యూనియన్‌ మాదిరిగా దేశం కూడా ముక్కలవుతుందని శివసేన అధికార పత్రిక సామ్నా పేర్కొంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు దెబ్బతినడంపై ఈ మేరకు హెచ్చరించింది. ‘రాజకీయ లాభం కోసం ప్రజలకు హాని చేస్తున్నారన్నది కేంద్ర ప్రభుత్వం గుర్తించకపోతే, మన దేశంలోని రాష్ట్రాలు సోవియట్ యూనియన్ లాగా విడిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు. 2020 సంవత్సరాన్ని చూస్తే ఇలాంటి ప్రశ్నలే కలుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సామర్థ్యం, విశ్వసనీయతపై రాష్ట్రాలకు అనుమానాలు కలుగుతున్నాయి’ అని ‘రోక్ టోక్’ పేరుతో ఒక ఎడిటోరియల్‌ కథనాన్ని ఆదివారం ప్రచురించింది. 

‘మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను రద్దు చేసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బీహార్‌లో యువ ఆర్జేడీ నాయకుడు తేజశ్వి యాదవ్ బీజేపీకి సవాల్‌ విసిరారు. కశ్మీర్‌ లోయలో అస్థిరత కొనసాగుతోంది. చైనా దళాలు భారత్‌ రిహద్దుల్లోకి ప్రవేశించాయి. కాని వారిని వెనక్కి నెట్టడం లేదు. బదులుగా సంక్షోభం నుండి దేశం దృష్టిని మళ్ళించడానికి జాతీయవాదం ఉపయోగిస్తున్నారు. పంజాబ్ రైతులపై బల ప్రయోగం ప్రారంభమైంది. రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు, కానీ కేంద్ర ప్రభుత్వం ఉద్యమం గురించి పట్టించుకోదు. ఈ ప్రభుత్వం వైఫల్యానికి కారణం చెల్లాచెదురైన బలహీనమైన ప్రతిపక్షం. దేశంలో ప్రజాస్వామ్యం పతనం ప్రారంభమైంది. బీజేపీ లేదా మోడీ-షా ప్రభుత్వం దీనికి బాధ్యత వహించదు. ప్రతిపక్ష పార్టీలే చాలా బాధ్యత వహించాలి. ప్రస్తుత పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడానికి బదులు ప్రతిపక్షాలు ఆత్మపరిశీలన చేసుకోవాలి’ అని మరాఠీ దినపత్రిక సామ్నా పేర్కొంది. ‘సరిహద్దులోకి చొచ్చుకొచ్చిన చైనా సైన్యాన్ని వెనక్కి నెట్టని కేంద్రం, జాతీయ వాదం పేరుతో సంక్షోభంపై దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నది. మరోవైపు చైనా వస్తువులు, పెట్టుబడుల బహిష్కరణకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది’ అని సామ్నా విమర్శించింది. 

కరోనా వ్యాప్తి తరువాత ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి కేంద్రం ప్రకటించిన రిలీఫ్ ప్యాకేజీని ఎద్దేవా చేసింది. ‘కరోనా నేపథ్యంలో ప్రపంచం మొత్తం ఇబ్బందుల్లో ఉంది. కానీ ఆర్థిక సంక్షోభంతో పోరాడుతున్న పౌరులకు అమెరికా మంచి ప్యాకేజీని ఇచ్చింది. ఈ ప్యాకేజీ ప్రతి యుఎస్ పౌరుడి బ్యాంకు ఖాతాలో నెలకు రూ. 65,000 జమ చేస్తుంది. బ్రెజిల్,  ఐరోపా దేశాల్లో ఇలాంటి ప్యాకేజీలు ప్రవేశపెట్టారు. అయితే సంవత్సరం ముగిసిన తరువాత కూడా భారతీయ పౌరులు ఖాళీ చేతులతో మిగిలిపోయారు’ అని వ్యాఖ్యానించింది. కొత్త పార్లమెంటు భవనం నిర్మాణం  దేశ పరిస్థితిని మార్చదని సామ్నా పేర్కొంది. రూ.1,000 కోట్లతో కొత్త పార్లమెంట్ హౌస్ భవనాన్ని నిర్మించటానికి బదులుగా, ఆ డబ్బును ఆరోగ్య వ్యవస్థ కోసం ఖర్చు చేయాలని దేశంలోని ప్రముఖులు ప్రధాని మోడీకి చెప్పిన విషయాన్ని సామ్నా సంపాదకీయం గుర్తు చేసింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo