గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 02:25:59

తెలంగాణ భేష్‌

తెలంగాణ భేష్‌

  • నాలుగుకోట్ల కన్నా ఎక్కువ జనాభా ఉన్న రాష్ర్టాల్లో మనవద్దే అత్యధిక రికవరీ 
  • దేశ సగటు 64.4 శాతం కాగా.. తెలంగాణలో 74 శాతం 
  • పెద్ద రాష్ర్టాలలో మనదే అగ్రస్థానం

న్యూఢిల్లీ: కరోనా నుంచి కోలుకుంటున్న వారి పరంగా చూస్తే.. నాలుగు కోట్ల కన్నా ఎక్కువ జనాభా ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. తెలంగాణలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య 74 శాతం. ఇది జాతీయ సగటు (64.4 శాతం) కంటే ఎక్కువ. తెలంగాణతోపాటు మొత్తం 16 రాష్ర్టాల్లో రికవరీరేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా నమోదవుతున్నదని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ గురువారం ప్రశంసించారు. అత్యధిక రికవరీ రేటు ఢిల్లీలో 88 శాతం ఉండగా, లఢక్‌లో 80 శాతం, హర్యానాలో 78 శాతం, అసోం లో 76 శాతం, తెలంగాణలో 74 శాతం ఉందన్నారు. ఆ తర్వాత స్థానాల్లో తమిళనాడు, గుజరాత్‌ (73 శాతం), రాజస్థాన్‌ (70 శాతం), మధ్యప్రదేశ్‌ (69 శాతం), గోవా (68 శాతం) ఉన్నట్లు తెలిపారు. అయితే, జనాభా పరంగా చూస్తే తెలంగాణ కన్నా ముందున్న ఢిల్లీ, లఢక్‌, హర్యానా, అసోం జనాభా తెలంగాణ కన్నా చాలా తక్కువ. ఈ లెక్కన దాదాపు నాలుగు కోట్ల జనాభా ఉన్న తెలంగాణ దేశంలోని మిగిలిన పెద్ద రాష్ర్టాలన్నింటికన్నా రికవరీ పరంగా మొదటిస్థానంలో ఉందని స్పష్టమవుతుంది.


logo