శనివారం 30 మే 2020
National - May 21, 2020 , 01:21:39

కొత్త జీవనం వైపు ప్రపంచం

కొత్త జీవనం వైపు ప్రపంచం

  • 'లాక్‌'ను సడలిస్తున్న దేశాలు 
  • నిత్య జీవితంలో పెనుమార్పులు
  • కరోనా సోకకుండా జాగ్రత్తలు

రోమ్‌/న్యూఢిల్లీ, మే 20: కరోనా విశ్వమారి విజృంభణతో లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయిన ప్రపంచం.. తిరిగి మెల్లిగా తలుపులు తెరుస్తున్నది. కొన్ని వారాల తర్వాత ప్రజలు రోడ్ల మీదికి వస్తున్నారు. పరిశ్రమలు ప్రారంభం అవుతున్నాయి. ప్రజారవాణా మళ్లీ మొదలైంది. సరిహద్దులు తెరుచుకుంటున్నాయి. ప్రజలు క్రమంగా రోజువారీ పనుల్లో నిమగ్నం అవుతున్నారు. జీవితం గతంలో మాదిరిగా ఉండదని.. ప్రతి ఒక్కరికీ అవగతమవుతున్నది. అందుకే సరికొత్త జీవన విధానం దిశగా అడుగులు వేస్తున్నారు. 

  • అలవాటు పడుతున్నారు: కరోనా ముప్పు ఇంకా పొంచి ఉన్న నేపథ్యంలో ‘స్వీయ నియంత్రణ’ పాటిస్తున్నారు. మాస్కులు ధరించడం, నిర్ణీత దూరం పాటించడం, చేతులు కడుగడం, శానిటైజర్లు వాడటం వంటి ‘కరోనా’ నిబంధనలను అలవాటు చేసుకుంటున్నారు.
  • వ్యాపారంలో మార్పులు: కరోనానంతర కాలానికి అలవాటు పడుతున్నామని ఇటలీలోని రోమ్‌కు చెందిన రెస్టారెంట్‌ యజమాని క్రిస్టో పేర్కొన్నారు. సిబ్బందికి గ్లౌజులు, మాస్కులు, ప్రతి టేబుల్‌పై శానిటైజర్‌ ఉంచడం, మెనూ కార్డ్‌ను కస్టమర్ల ఫోన్‌కు వాట్సప్‌ చేయడం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెప్పారు.    
  • ఆన్‌లైన్‌ క్లాసులు: కేంబ్రిడ్జి యూనివర్సిటీ ఈ విద్యాసంవత్సరం మొత్తం ఆన్‌లైన్‌ తరగతులే నిర్వహిస్తామని ప్రకటించింది. అధికశాతం పాఠ్యాంశాలు ఆన్‌లైన్‌లోనే బోధిస్తామని కాలిఫోర్నియా వర్సిటీ ప్రకటించింది. నోటర్‌డ్యామ్‌ వర్సిటీ విద్యా సంవత్సరాన్ని ఆగస్టు మొదటి వారానికి మార్చింది. 
  • స్కూళ్లలో కొత్త రూల్స్‌: దక్షిణ కొరియాలో బుధవారం నుంచి హైస్కూళ్లు ప్రారంభమయ్యాయి. ఉష్ణోగ్రతా పరీక్షలు, మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరి చేశారు. విద్యార్థుల మధ్య ప్లాస్టిక్‌ షీట్లు అడ్డం పెట్టారు.  
  • భౌతిక దూరం తప్పదు: స్లోవేకియాలో బుధవారం నుంచి థియేటర్లు, షాపింగ్‌మాళ్లు తెరిచారు. జూన్‌ 1 నుంచి బార్లు, రెస్టారెంట్లు తెరుచుకోనున్నాయి. అయితే అన్ని చోట్లా కచ్చితంగా భౌతిక దూరం పాటించడం తప్పనిసరి. 
  • సమస్యలు కూడా:  కరోనా నేపథ్యంలో మన దేశంలో వలస కార్మికులు సొంతూళ్లబాట పట్టారు. వారు ఇప్పట్లో తిరిగి రావడం కష్టమే. దీంతో ప్రధాన నగరాల్లో కూలీల కొరత పెరిగింది. నెలలపాటు మూసి ఉంచడంతో హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార పదార్థాలన్నీ పాడైపోయాయి. అసలే లాక్‌డౌన్‌తో పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిన వ్యాపారులకు ఇది పిడుగుపాటుగా మారనుంది. 


logo