సోమవారం 30 మార్చి 2020
National - Mar 01, 2020 , 11:22:39

లారీల నుంచి లంచాలు 48 వేల కోట్లు!

లారీల నుంచి లంచాలు 48 వేల కోట్లు!
  • రోడ్లపై ట్రక్కు డ్రైవర్లు, యజమానులను పీల్చిపిప్పిచేస్తున్న లంచగొండులు
  • ట్రాఫిక్‌ పోలీసులు, ఆర్టీవోలకు అదనం
  • గువాహటి, ఢిల్లీ, చెన్నైల్లో సమస్య తీవ్రం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 29: హైవే మీద చెక్‌పోస్ట్‌ల దగ్గర లారీ డ్రైవర్లు, ఓనర్లు ‘కచ్చితంగా’ ఎంతో కొంత సమర్పించుకోవడం చూస్తూనే ఉంటాం. ట్రాఫిక్‌ పోలీసులు, ఆర్టీవో అధికారుల బాదుడు దీనికి అదనం. ఇలా ఒక్కో ట్రిప్పునకు సగటున రూ.1,257 వసూలు చేస్తున్నారట. డ్రైవింగ్‌ లైసెన్స్‌ రెన్యువల్‌, బండి రిజిస్ట్రేషన్‌ సమయంలోనూ రూ.1500 వరకు మోత తప్పడం లేదు. దేశం మొత్తం ఉన్న లారీల డ్రైవర్లు, ఓనర్లు కలిసి ట్రాఫిక్‌, హైవే పోలీసులు, ఆర్టీవో అధికారులు తదితరులకు ప్రతి సంవత్సరం సమర్పించుకుంటున్న ఆమ్యామ్యాల మొత్తం అక్షరాలా 48వేల కోట్ల రూపాయలట. ‘సేవ్‌ లైఫ్‌ ఫౌండేషన్‌' అనే స్వచ్ఛంద సంస్థ సర్వే చేసి తేల్చిన లెక్క ఇది. దేశవ్యాప్తంగా ఉన్న పది భారీ రవాణా కేంద్రాలు (ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ ట్రాన్సిస్ట్‌ హబ్‌) పరిధిలో అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించింది. సర్వేలో భాగంగా 1,217 మంది డ్రైవర్లు, 110 మంది యజమానులను సమగ్రంగా ప్రశ్నలు అడిగారు. ఈ నివేదికను కేంద్ర రవాణాశాఖ సహాయమంత్రి వీకే సింగ్‌ ఇటీవలే విడుదల చేశారు. దీని ప్రకారం.


చెయ్యి తడిపితేనే కదిలేది

ప్రతి ట్రిప్పునకు లంచం ఇస్తున్నామని సగటున 82% శాతం మంది డ్రైవర్లు చెప్తున్నారు. ఈ జాబితాలో గువాహటి, చెన్నై, ఢిల్లీ అగ్రస్థానంలో ఉన్నాయి. ఒక ట్రిప్పునకు సగటున చెల్లిస్తున్న మొత్తం రూ.1,257. నిబంధనల ప్రకారమే వెళ్తున్నా.. కొన్ని ప్రాంతాల్లో ఆర్టీవో అధికారులు వాహన రకాన్ని బట్టి ‘నిర్ణీత’ మొత్తం వసూలు చేస్తున్నారట. ఇలా ధరల పట్టిక అమలు చేస్తున్న హబ్‌లలో బెంగళూరు, గువాహటి టాప్‌లో ఉన్నాయి. 


ముట్టజెప్తేనే.. రెన్యువల్‌, రిజిస్ట్రేషన్‌ 

డ్రైవింగ్‌ లైసెన్స్‌ రెన్యువల్‌ సమయంలో ఆర్టీవో అధికారులకు లంచం ఇవ్వాల్సి వస్తున్నదని సగటున 47 శాతం మంది డ్రైవర్లు చెప్పారు. ముంబైలో ఏకంగా 93 శాతం మంది నుంచి, ఢిల్లీలో 78శాతం మంది నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారట. ఇలా లైసెన్స్‌ రెన్యువల్‌కు ఒక్కో డ్రైవర్‌ సగటున రూ.1,789 ముట్టజెప్తున్నారని తేలింది. అత్యధికంగా ఢిల్లీలో రూ. 2,025 ముట్టజెప్పాల్సి వస్తున్నదని వాపోతున్నారు. అదేవిధంగా ట్రక్కుల రిజిస్ట్రేషన్‌ సమయంలో  ఒక్కో వాహనానికి సగటున రూ.1,360 ముట్టజెప్పాల్సి వస్తున్నదని వాపోతున్నారు. 


logo