ఆదివారం 09 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 20:46:46

కరోనా ఆత్మహత్య ఆలోచనను రేకెత్తిస్తోందట!

కరోనా ఆత్మహత్య ఆలోచనను రేకెత్తిస్తోందట!

తిరువనంతపురం :  కరోనా మహమ్మారి ఆత్మహత్యలకు దారి తీస్తుందని ప్రజారోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇవి కేరళ రాష్ట్రంలో తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా మారాయని అంచనా వేస్తున్నారు. దీన్ని పరిష్కరించేందుకు సమగ్ర బహుళ రంగాల ఆత్మహత్యల నివారణ వ్యూహాన్ని కోరుతున్నారు. ఇదిలా ఉండగా, ఆత్మహత్యల నివారణపై దృష్టి సారించి, ‘జీవరక్ష’ ప్రచారం నిర్వహిస్తున్నట్లు కేరళ వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంటోంది. ‘ఒక్క విషయం స్పష్టం. రాష్ట్రంలో ఆత్మహత్యలు ప్రజా ఆరోగ్య సమస్యగా మారబోతున్నాయి.

మార్చి 25 నుంచి 66 మంది చిన్నారులు ఆత్మహత్య చేసుకున్న గణాంకాలు మినహా రాష్ట్రంలో ఈ మహమ్మారి ప్రబలినప్పటి నుంచి ఆత్మహత్యల రేటుపై అధికారిక వివరాలు ఇంకా బయటకు రాలేదు. ఇది భయాందోళనలు కలిగిస్తుంది’ అని ఆరోగ్య విభాగంలోని ఓ అధికారి పేర్కొన్నారు. ‘ఆత్మహత్యా ధోరణికి కారణం సామాజిక ఒంటరితనం. స్వీయ వినాశకరమైన బాధ, ఆందోళనను నిర్వహించడానికి, గుర్తించడానికి ఒక వ్యూహం ఉండాలి. అయితే దీనికి మూల కారణం వ్యక్తులమధ్య వేర్వేరుగా ఉంటుంది’ అని తిరువనంతపురంలోని మానసిక ఆరోగ్య కేంద్రానికి చెందిన సాగర్‌ తెలిపారు.

పాజిటివ్.. నెగటివ్ మైండ్‌ గేమ్‌

కొవిడ్ -19కు పాజిటివ్‌గా పరీక్షించిన వెంటనే ప్రతికూల ఆలోచనల్లోకి వెళ్తారని, తద్వారా తీవ్రమైన డిప్రెషన్‌కు గురవుతారని మానసిక ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. ఒక ప్రధాన కారణం వ్యాధికి వ్యాక్సిన్ తీసుకోకూడదనే ఆలోచన. చాలా మందికి ఔషధం ఒక వ్యాధికి నివారణ మాత్రమే. ఒక వ్యాధిని నయం చేయడంలో మానసిక బలం పాత్రను వారు పట్టించుకోరు. ఇతరులకు ఇది సామాజిక బహిష్కరణ, అనుమానాస్పద చూపులు.. మొరటు వ్యాఖ్యలు’ అని మానసిక, సామాజిక మద్దతు చొరవతో సంబంధం ఉన్న ఒక అధికారి చెప్పారు.

మణిపాల్‌లోని కస్తూర్బా మెడికల్ కాలేజీలో బయోఎథిక్స్, గ్లోబల్ హెల్త్ అండ్ పాలసీకి సంబంధించిన సమస్యలపై పనిచేస్తున్న డాక్టర్ అనంత్ భాన్ మాట్లాడుతూ కొవిడ్-19 ప్రేరేపిత అనిశ్చితి, లాక్‌డౌన్‌, ఆర్థిక పతనం కారణంగా కలిగే ఒత్తిడి, ఆందోళన కారణంగా ఆత్మహత్యల్లో ఒక ఊర్థ్వ ధోరణి చోటు చేసుకోవడానికి అవకాశం ఉందని పేర్కొన్నారు. పిల్లల విషయంలో, స్నేహితులను కలుసుకోలేకపోవడం, ఆన్‌లైన్‌ తరగతులకు హాజరు కావడం, ఇంట్లో వేధింపులు పెరిగే అవకాశం ఉండడం వంటి కారణంగా ఇవి చోటు చేసుకోవచ్చునని భాన్‌ చెప్పారు.లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo