గురువారం 09 ఏప్రిల్ 2020
National - Mar 08, 2020 , 02:25:13

చైనా వెలుపల విజృంభణ

చైనా వెలుపల విజృంభణ
  • అమెరికాలోని క్రూయిజ్‌ నౌకలో 21 మందికి కరోనా
  • భారత్‌లో మరో ముగ్గురికి వైరస్‌.. 34కు చేరినకేసులు

బీజింగ్‌:  చైనా వెలుపల కరోనా వైరస్‌ అంతకంతకూ విజృంభిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 92 దేశాల్లో లక్ష మందికిపైగా వైరస్‌ సోకగా, దాదాపు 3,500 మంది మృత్యువాతపడ్డారు. అమెరికాలోని కాలిఫోర్నియా తీరంలో నిలిపి ఉంచిన గ్రాండ్‌ ప్రిన్స్‌ క్రూయిజ్‌ నౌకలో 21 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారించారు. ఈ వారాంతానికి నౌకను కమర్షియల్‌ డాక్‌కు తీసుకొచ్చి, అందులోని 3,533 మంది ప్రయాణికులు, సిబ్బందికి పరీక్షలు నిర్వహిస్తామని అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ తెలిపారు. అమెరికాలో కరోనా మృతుల సంఖ్య 16కు పెరిగింది. స్లొవేకియా, సెర్బియా, వాటికన్‌, పెరూ, కామెరూన్‌, టొగోలలో తొలి కేసులు నమోదుకాగా, నెదర్లాండ్స్‌లో తొలి మరణం నమోదైంది. ఇరాన్‌లో మృతుల సంఖ్య 145కు పెరిగింది. దక్షిణ కొరియాలో కరోనా కేసులు 7,000 దాటాయి. చైనా వెలుపల ఇవే అత్యధికం. చైనాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కరోనాతో పర్యాటక రంగం ఈ ఏడాది 3% క్షీణించనుందని ప్రపంచ పర్యాటక సంస్థ అంచనా వేసింది. 


భారత్‌లో మరో మూడు కేసులు

భారత్‌లో శనివారం మరో మూడు కేసులు వెలుగు చూశాయి. దీంతో కరోనా సోకిన వారి సంఖ్య 34కు పెరిగింది. ఇరాన్‌ నుంచి వచ్చిన ఇద్దరు లడఖ్‌ వాసులకు, ఒమన్‌ నుంచి వచ్చిన తమిళనాడు వాసికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు కేంద్ర వైద్య శాఖ తెలిపింది. బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పేర్కొంది. అలాగే భూటాన్‌లో కరోనా నిర్ధారణ అయిన ఇద్దరు అమెరికన్లతో కలిసి ప్రయాణించిన 150 మంది భారతీయులను పర్యవేక్షణలో ఉంచినట్లు తెలిపింది.  దేశంలో కరోనా పరిస్థితిపై ప్రధాని మోదీ శనివారం సమీక్ష నిర్వహించారు. ప్రజల్లో అవగాహన పెంచాలని అధికారులకు సూచించారు. 


logo