సోమవారం 30 మార్చి 2020
National - Mar 05, 2020 , 13:38:36

29 మందికి కరోనా

29 మందికి కరోనా
  • బాధితుల్లో 16 మంది ఇటలీ యాత్రికులు
  • పేటీఎం ఉద్యోగికి కరోనా పాజిటివ్‌
  • ఇకపై విదేశీ ప్రయాణికులందరికీ స్క్రీనింగ్‌ టెస్ట్‌
  • కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ వెల్లడి

న్యూఢిల్లీ, మార్చి 4: దేశంలో ఇప్పటివరకు మొత్తం 29 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీరిలో 16 మంది ఇటలీ యాత్రికులేనని తెలిపింది. ఇకపై విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరికీ విమానాశ్రయాల్లో స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో 28 మందికి కరోనా సోకినట్లు చెప్పారు. ఢిల్లీలోని మయూర్‌ విహార్‌కు చెందిన 45 ఏండ్ల వ్యక్తికి, అతడి ఆరుగురు బంధువులకు వైరస్‌ సోకినట్టు తేలిందన్నారు. ఆ వ్యక్తి ఇటీవలే ఆగ్రాలో పర్యటించారని, దీంతో అతడి బంధువులకు వైరస్‌ సోకిందన్నారు. వారందరికీ ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ దవాఖానలో చికిత్స అందిస్తున్నామని అన్నారు. భారత పర్యటనకు వచ్చిన ఇటలీకి చెందిన 16 మంది యాత్రికులు, వారి డ్రైవర్‌కు కూడా వైరస్‌ సోకినట్టు తేలిందన్నారు. వీరిలో ఇద్దరికి జైపూర్‌లో, మిగతా 15 మందికి చావ్లాలోని ఐటీబీపీ క్యాంప్‌లో చికిత్స అందిస్తున్నామని అన్నారు. 


తెలంగాణలో ఒకరికి కరోనా నిర్ధారణ అయ్యిందని, మరో ఇద్దరు అనుమానితులను పరీక్షిస్తున్నామని తెలిపారు. కేరళలో గతంలోనే ముగ్గురు కరోనా బాధితులను గుర్తించగా.. చికిత్స అనంతరం వారిని డిశ్చార్జి చేసినట్టు చెప్పారు. అయితే తమ ఉద్యోగి ఒకరికి కరోనా పాజిటివ్‌ అని వచ్చినట్లు ప్రముఖ ఆన్‌లైన్‌ పేమెంట్‌ సేవల సంస్థ పేటీఎం బుధవారం సాయంత్రం ప్రకటించింది. దీంతో బాధితుల సంఖ్య 29కి పెరిగింది. గురుగ్రామ్‌కు చెందిన తమ ఉద్యోగి ఇటీవలే ఇటలీ నుంచి తిరిగి వచ్చినట్లు పేటీఎం తెలిపింది. ఉద్యోగులను రెండు రోజులపాటు ఇంటి నుంచే పనిచేయాలని సూచించినట్లు పేర్కొంది.  దేశంలోని 21 అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఇకపై అన్ని దేశాల ప్రయాణికులను పరీక్షిస్తామని కేంద్రం తెలిపింది. 


పర్యాటకులకు పరీక్షలు 

కరోనా అనుమానంతో ఇటలీకి చెందిన తొమ్మిది మంది పర్యాటకులను, భారత్‌కు చెందిన వారి గైడ్‌ను మధ్యప్రదేశ్‌లోని ఛాతర్‌పూర్‌లో ఉన్న ప్రత్యేక వైద్య కేంద్రంలో ఉంచారు. మరోవైపు కరోనా వైరస్‌ నేపథ్యంలో పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులు ఫేస్‌మాస్క్‌లు, శానిటైజర్లు తీసుకుని వెళ్లొచ్చని సీబీఎస్‌ఈ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా లక్షణాలు, జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని కేంద్ర మానవ వనరుల (హెచ్చార్డీ) మంత్రిత్వ శాఖ బుధవారం అన్ని రాష్ర్టాల ప్రభుత్వాలకు, సీబీఎస్‌ఈకి సూచించింది.


జాగ్రత్తలు తీసుకోండి

వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని హర్షవర్ధన్‌ సూచించారు. ఎక్కువ మంది ఒకేచోట గుమిగూడొద్దని సూచించారు. తాకడం, చేతులు కలుపడం, కౌగిలించుకోవడం వంటివి చేయొద్దని చెప్పారు. మాస్కుల కొరతపై స్పందిస్తూ.. ‘ఎన్‌95 మాస్కుల ఎగుమతులపై నిషేధం విధించాం. మాస్కుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం’ అని పేర్కొన్నారు. వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు క్లస్టర్‌ విధానం పాటిస్తున్నామని తెలిపారు. ఒక వ్యక్తికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయితే వైద్య బృందం ఆ వ్యక్తి ఇంటి చుట్టూ మూడు కి.మీల వైశాల్యం మేర క్లస్టర్‌గా ఎంచుకొని ఆ పరిధిలోని ఇంటింటికీ పరీక్షలు నిర్వహిస్తారని వెల్లడించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15 ల్యాబ్‌లలో కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని అన్నారు. మరో 19 ల్యాబ్‌లను సిద్ధం చేస్తున్నామన్నారు. మరోవైపు ‘ఇంటిగ్రేటెడ్‌ డిసీజ్‌ సర్వేలైన్స్‌ ప్రోగ్రాం’ (ఐడీఎస్పీ)లో భాగంగా కరోనా వైరస్‌ సోకిన వ్యక్తి ఎంత మందిని కలిసి ఉండొచ్చని తెలుసుకుంటున్నామని చెప్పారు. 


ఢిల్లీకి చెందిన రోగి ఇప్పటివరకు 66 మందిని, తెలంగాణకు చెందిన వ్యక్తి 88 మందిని కలిశారని అన్నారు. వారందరికీ పరీక్షలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. ఇరాన్‌లోని భారతీయులను పరీక్షించేందుకు అక్కడ ఒక ల్యాబ్‌ను ప్రారంభించనున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఇరాన్‌లో దాదాపు 1200 మంది భారతీయులు ఉన్నట్టు అంచనా. మరోవైపు, విదేశాల్లో మొత్తం 17 మంది భారతీయులకు కరోనా సోకిందని భారత విదేశాంగశాఖ బుధవారం వెల్లడించింది. వీరిలో 16 మంది జపాన్‌ తీరంలో నిలిపివేసిన డైమండ్‌ ప్రిన్సెస్‌ నౌకకు చెందినవారని, మరొకరు దుబాయ్‌ వ్యక్తి అని విదేశాంగశాఖ సహాయమంత్రి  వీ మురళీధరన్‌ లోక్‌సభలో పేర్కొన్నారు. దేశంలో సదస్సులు, అంతర్జాతీయ సమావేశాలు నిర్వహించే ముందు ప్రభుత్వ విభాగాలన్నీ ముందుగా కేంద్ర వైద్య శాఖకు  సమాచారమివ్వాలని నిర్ణయించారు. ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి పీకే మిశ్రా అధ్యక్షతన సమావేశమైన అంతర్‌మంత్రిత్వ శాఖల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.


logo