శుక్రవారం 05 జూన్ 2020
National - Jan 30, 2020 , 02:22:24

చైనాకు వెళ్లకండి!

చైనాకు వెళ్లకండి!
  • దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం సూచన
  • చైనాలో 132కు చేరిన మృతుల సంఖ్య
  • దేశంలో కరోనా వ్యాధిగ్రస్థులు లేరని వివరణ
  • చైనా నుంచి భారతీయుల తరలింపునకు ఏర్పాట్లు

న్యూఢిల్లీ/బీజింగ్‌, జనవరి 29: ప్రాణాంతక కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో భారతీయులెవరూ చైనాకు వెళ్లరాదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం సూచించింది. ఊపిరితిత్తులను దెబ్బతీస్తున్న కరోనా వైరస్‌కు సంబంధించిన సమాచారం కోసం ఏ సమయంలోనైనా సరే 011-23878046కు ఫోన్‌చేయవచ్చని తెలిపింది. వైరస్‌ బాధితులను గుర్తించేందుకు కేంద్రం దేశంలోని 21 విమానాశ్రయాల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌ యంత్రాలను ఏర్పాటుచేసింది. వ్యాధి బాధితుల రక్త నమూనాలను పరీక్షించేందుకు ఎన్‌ఐవీ-పుణెకు తోడుగా కొత్తగా హైదరాబాద్‌, అలెప్పీ, బెంగళూరు, ముంబై నగరాల్లో మరో నాలుగు పరిశోధనశాలలను ఏర్పాటు చేసింది. వైరస్‌కు కేంద్రమైన చైనాలోని వుహాన్‌ నగరం నుంచి భారతీయులను ముఖ్యంగా విద్యార్థులను భారత్‌కు రప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఈ మేరకు ఇప్పటికే కేంద్రం చైనాకు అధికారికంగా విజ్ఞప్తి చేసింది. చైనా నుంచి అనుమతి రాగానే భారతీయులను తరలించేందుకు పౌర విమానయాశాఖ సంసిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. దేశంలో ఇప్పటివరకు ఎవరూ కరోనా బాధితులుగా నిర్ధారణ కాలేదని కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ చెప్పారు. .


చైనాలో పెరుగుతున్న మృతులు

కరోనావైరస్‌ కాటుకు చైనాలో మరో 25 మంది బలయ్యారు. దీంతో ఈ వ్యాధి బారిన పడి మరణించిన వారి సంఖ్య 132కుచేరింది.  వ్యాధి బాధితుల సంఖ్య ఆరువేలను దాటిందని, మరో పది రోజుల్లో వైరస్‌ మరింత విజృంభించవచ్చని అధికారులు హెచ్చరించారు. బాధితుల్లో 1,239 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. తాజాగా 9,239 మంది వ్యాధి లక్షణాలతో దవాఖానాల్లో చేరారని, వీరిలో 103 మంది కోలుకున్నారని చెప్పారు. ఏ దేశమైనా తమ పౌరులను తరలించాలనుకుంటే వారి ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని చైనా తెలిపింది. భారత్‌తోపాటు వివిధ దేశాలు తమ పౌరులను తరలించేందుకు యత్నిస్తున్నాయి. 


 హైరిస్క్‌ జాబితాలో భారత్‌ 

కరోనా వైరస్‌ విస్తరించేందుకు అవకాశం ఉన్న 30 దేశాలలో భారత్‌ కూడా ఉందని బ్రిటన్‌కు చెందిన సౌతాంప్టన్‌ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. కరోనా వైరస్‌ విస్తరించే ప్రమాదం ఉన్న దేశాలలో థాయ్‌లాండ్‌ మొదటిస్థానంలో ఉండగా, ఆ తరువాతి స్థానాల్లో జపాన్‌ (2), హాంగ్‌కాంగ్‌(3), అమెరికా (6), ఆస్ట్రేలియా (10), బ్రిటన్‌ (17) ఉన్నాయి. భారత్‌ 23వ స్థానంలో ఉంది. logo