బుధవారం 03 జూన్ 2020
National - Feb 02, 2020 , 02:14:54

మృత్యుముఖం నుంచి బయటకు!

మృత్యుముఖం నుంచి బయటకు!
  • చైనా నుంచి ఢిల్లీ చేరుకున్న 324 మంది భారతీయులు
  • ఎవరికీ వైరస్‌ సోకలేదన్న వైద్యులు
  • చైనాకు బయల్దేరిన మరో విమానం
  • 259కి చేరిన కరోనా మృతులు

న్యూఢిల్లీ: చైనాలోని వుహాన్‌ నగరం నుంచి 324 మంది భారతీయులు శనివారం ఉదయం 7:30 గంటలకు ఢిల్లీకి చేరుకున్నారు. వీరిలో 211 మంది విద్యార్థులు, 110 మంది ప్రొఫెషనల్‌ ఉద్యోగులు మరో ముగ్గురు మైనర్లు ఉన్నారు. వీరిలో కొందరిని ఢిల్లీ సమీపంలోని మానేసర్‌లో సైన్యం ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య కేంద్రంలో, మరికొందరిని ఢిల్లీలోని ఛావ్లా ప్రాంతంలో ఐటీబీపీ ఏర్పాటు చేసిన మరో కేంద్రంలో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహించారు. చైనా నుంచి వచ్చినవారిలో ఎవరిలోనూ కరోనా ఆనవాళ్లు కనిపించలేదని డాక్టర్లు తెలిపారు.  మరోవైపు చైనాలో ఉన్న మరికొందరు భారతీయులను తీసుకురావడానికి శనివారం మధ్యా హ్నం మరో విమానం వెళ్లింది. హుబెయి ప్రావిన్సు లో 600 మందికిపైగా భారతీయులు ఉన్నారు. 


ఆరుగురికి తీవ్ర జ్వరం 

వాస్తవానికి చైనా నుంచి భారత్‌కు శనివారం 330 మంది భారతీయులు రావాల్సి ఉన్నది. అయితే, వీరిలో ఆరుగురు తీవ్ర జ్వరంతో బాధపడుతుండ టంతో చైనా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు వారిని అక్కడే ఆపేశారు. వారిని వైద్యపరీక్షల అనంతరం భారత్‌కు పంపే అవకాశమున్నది. మరోవైపు, చైనాలో కరోనా వైరస్‌ మృతుల సంఖ్య 259కి చేరింది. మరో 11,791 మందికి ఈ వైరస్‌ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. వీరిలో 1,795 మంది పరిస్థితి విషమంగా ఉన్నదన్నారు. మరో 17,988 మందిలో ఈ వ్యాధి లక్షణాలున్నట్టు అనుమానిస్తున్నారు. మరో 1,18,478 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. కరోనా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో అమెరికా ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. చైనా నుంచి వచ్చే పర్యాటకులపై నిషేధం విధించింది. 


మూగజీవాల ఉసురు తీస్తున్నారు

కరోనా వైరస్‌ సోకుతుందన్న వదంతులతో చైనా ప్రజలు ఇన్నాళ్లూ అల్లారుముద్దుగా పెంచుకున్న మూగజీవాలను చంపేస్తున్నారు. కుక్క పిల్లల్ని, పిల్లి పిల్లల్ని భవంతుల మీది నుంచి విసిరేస్తున్నారు. ‘పెంపుడు జంతువులను వైరస్‌ సోకిన వారి దగ్గరికి వెళ్లనివ్వద్దు’ అని ఓ వైద్యురాలు ఇచ్చిన ప్రకటనను మీడియా తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే ఈ పరిణామానికి దారి తీసిందని సమాచారం. 


logo