ఆదివారం 29 మార్చి 2020
National - Feb 10, 2020 , 02:30:29

కొనసాగుతున్న కరోనా విలయం

కొనసాగుతున్న కరోనా విలయం
  • 813కు చేరిన మృతుల సంఖ్య.. మరో 37,287 మందికి వైరస్‌ నిర్ధారణ
  • కరోనా వైరస్‌ విస్తరించే అవకాశమున్న దేశాల్లో భారత్‌
  • వైరస్‌ వ్యాప్తికి కారణం కానున్న ఢిల్లీ, ముంబై, కోల్‌కతా విమానాశ్రయాలు: జర్మనీ పరిశోధకుల అంచనా
  • వ్యాక్సిన్‌ అభివృద్ది కోసం పరిశోధనలు ముమ్మరంచేసిన ప్రపంచ దేశాలు
  • కరోనాను అడ్డుకోవడంలో చైనాకు పూర్తి సహకారాలు అందిస్తాం: మోదీ

న్యూఢిల్లీ/బీజింగ్‌: చైనాతోపాటు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ ఉద్ధృతి క్రమంగా పెరుగుతున్నది. కరోనా సోకి శనివా రం ఒక్కరోజే 91 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చాలామంది వైరస్‌కు కేంద్ర మైన హుబెయ్‌ రాష్ట్రం నుంచే ఉండడం గమనార్హం. దీంతో కరోనా వల్ల ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 813కు చేరింది. కొత్తగా మరో 2,656 మందిలో కరోనా వైరస్‌ని గుర్తించడంతో వైరస్‌ బారిన పడ్డ వారి సంఖ్య 37,287కి చేరింది. అయితే, హుబెయ్‌ వెలుపల శనివారంనాటికి వైరస్‌ బారిన పడ్డ వారి సంఖ్య 509గా ఉన్నదని, గత సోమవారంతో పోలిస్తే(890 మంది) బాధితుల సంఖ్య కొంతమేర తగ్గినట్టు చైనా కేంద్ర ఆరోగ్య కమిషన్‌ తెలిపింది. దీని నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నది. శనివారం దాదాపు 600 మంది వైరస్‌ నుంచి విముక్తి పొందినట్టు అధికారులు పేర్కొన్నారు. కాగా 2002-2003 మధ్య ప్రపంచ దేశాల్ని వణికించిన సార్స్‌ వైరస్‌ దాదాపు 774 మందిని బలిగొన్న విషయం తెలిసిందే.


భారత్‌కు కరోనా ముప్పు 

కరోనా వైరస్‌ విస్తరించే అవకాశం గల దేశాల్లో భారత్‌ ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. కరోనా సోకిన బాధితులు చైనా నుంచి ఇదివరకే వివిధ దేశాలకు చేరుకొని ఉండొచ్చని, ఆ దేశాల జాబితాలో భారత్‌ 17వ స్థానంలో ఉన్నదని.. జర్మనీలోని హమ్‌బోల్ట్‌ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా 4 వేల విమానాశ్రయాల మధ్య విమాన రాకపోకల ఆధారంగా ఈ నివేదికను తయారు చేశారు. ‘2019 నోవెల్‌ కరోనా వైరస్‌ గ్లోబల్‌ రిస్క్‌ అసెస్‌మెంట్‌' అనే ఈ నివేదికలో.. వాయు మార్గం ద్వారా భారత్‌కు కరోనా సోకే ప్రమాదం 0.219 శాతంగా ఉన్నట్టు వెల్లడైంది. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా 0.066% ముప్పు.. ముంబైలోని ఛత్రపతి శివాజి విమానాశ్రయం ద్వారా ఈ ముప్పు 0.034 శాతంగా ఉన్నది. కోల్‌కతాలోని నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ఎయిర్‌పోర్ట్‌ నుండి కరోనా ముప్పు 0.020% ఉన్నదని నివేదిక పేర్కొంది. వీటితో పాటు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, కోచి విమానాశ్రయాల నుంచీ కరోనా ముప్పు పొంచి ఉన్నదని హెచ్చరించింది. కరోనా వెలుగుచూసిన వుహాన్‌ నగ రం.. చైనాలో ఏడో అతిపెద్ద సిటీ. 1.1 కోట్ల జ నాభా ఉన్న ఈ నగర విమానాశ్రయానికి చైనా తోపాటు పలు దేశాలతో వైమానిక మార్గాలున్నాయని, కరోనా ఉద్ధృతి పెరుగటంతో గత నెల జనవరి 23న వుహాన్‌ విమానాశ్రయాన్ని అధికారులు మూసేసే నాటికే చైనాలోని ఇతర రాష్ర్టాలు, పలు దేశాలకు ఈ వైరస్‌ వ్యాపించి ఉండొచ్చని నివేదిక అంచనా వేసింది. 


పరిశోధనలు ముమ్మరం

చైనాతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, సింగపూర్‌, ఫ్రాన్స్‌ తదితర దేశాల శాస్త్రవేత్తలు కరోనా వైరస్‌ నియంత్రణకు వ్యాక్సిన్‌ అభివృద్ధి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కొత్త టెక్నాలజీతో దీన్ని తయారు చేయనున్నట్టు వాళ్లు పేర్కొన్నారు. మరో ఆరు నెలల్లో కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ది చేస్తామని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు.. కనీసం 20 నెలలు పడుతుందని ఫ్రెంచ్‌ శాస్త్రవేత్తలు వెల్లడించారు.  


సహకారాలందిస్తాం

కరోనా వైరస్‌ను అడ్డుకోవడంలో చైనాకు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ క్రమంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఆయన ఓ లేఖను రాసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. కరోనా మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు మోదీ పేర్కొన్నట్టు అధికారులు చెప్పారు. చైనాలోని హుబేయిలో చిక్కుకున్న 650 మంది భారతీయులను భారత్‌కు తేవడంలో సహకరించినందుకు జిన్‌పింగ్‌కు మోదీ ధన్యవాదాలు తెలిపినట్టు పేర్కొన్నారు.


‘ఎయిర్‌ షో’పై కరోనా దెబ్బ 

ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శనకు కరోనా వైరస్‌ చిక్కులు తెచ్చిపెట్టింది. సింగపూర్‌ వేదికగా వచ్చే మంగళవారం ప్రారంభం కానున్న ఈ ఎయిర్‌ షోలో పాల్గొనేందుకు దాదాపు 70 ప్రదర్శన సంస్థలు విముఖత వ్యక్తం చేస్తున్నాయి. వీటిలో అమెరికాకు చెందిన లాక్‌హీడ్‌ మార్టిన్‌ వంటి దిగ్గజ సంస్థలతో పాటు చైనాకు చెందిన డజను కంపెనీలు కూడా ఉన్నాయి. కరోనా వైరస్‌ తీవ్రతరం కావడమే సదరు సంస్థలు వెనుకంజ వేయడానికి ప్రధాన కారణమని ఎయిర్‌ షో నిర్వాహకులు పేర్కొన్నారు. మరోవైపు, కరోనా వైరస్‌ సోకిన కొందరు ఓడలో ప్రయాణిస్తున్నారన్న కారణంతో గత ఐదురోజులుగా హాంకాంగ్‌ తీరంలో నిలిచిపోయిన ‘వరల్డ్‌ డ్రీవ్‌ు’ నౌకను అధికారులు ఆదివారం విడుదల చేశారు. ఓడలోని 1,800 మందికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. వైరస్‌ లేదని తేలడంతో  ప్రయాణికులను విడుదల చేశారు.


logo