గురువారం 02 జూలై 2020
National - Jun 24, 2020 , 02:48:42

హజ్‌కు పంపించలేం!

హజ్‌కు పంపించలేం!

  • కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
  • యాత్రికులకు డబ్బులు తిరిగి చెల్లిస్తాం
  • కేంద్రమంత్రి నఖ్వీ వెల్లడి

న్యూఢిల్లీ: ఈ ఏడాది హజ్‌ యాత్రకు భారత్‌ నుంచి యాత్రికులను పంపకూడదని నిర్ణయించినట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ చెప్పారు. సోమవారం రాత్రి సౌదీ అరేబియా మంత్రి మహమ్మద్‌ సల్హా బిన్‌ తాహిర్‌ బేన్‌టెన్‌ తనతో ఫోన్‌లో మాట్లాడారని, కరోనా నేపథ్యంలో ఈ ఏడాది భారత్‌ నుంచి యాత్రికులను పంపొద్దని ఆయన విజ్ఞప్తి చేశారని తెలిపారు. ఆయన సూచనను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం నఖ్వీ విలేకరులతో మాట్లాడుతూ హజ్‌యాత్రకు వెళ్లడానికి యాత్రికులు చెల్లించిన సొమ్మును తిరిగి వారి బ్యాంకు అకౌంట్లలోకి బదిలీ చేస్తామని చెప్పారు. 

హజ్‌ యాత్ర కోసం ఈ ఏడాది 2300 మందికిపైగా మహిళలు దరఖాస్తు చేసుకున్నారని, వీరిని వచ్చే ఏడాది వెళ్లేవారితో కలిపి పంపడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక భారత్‌ నుంచి హజ్‌ యాత్రకు ముస్లింలు వెళ్లకపోవడం ఇదే తొలిసారి అని నఖ్వీ పేర్కొన్నారు. మరోవైపు కరోనా వైరస్‌ నేపథ్యంలో ఈ ఏడాది హజ్‌ యాత్రకు అతి తక్కువ మందిని మాత్రమే, అది కూడా తమ దేశస్థులనే అనుమతించనున్నామని సౌదీ అరేబియా మంత్రి మహమ్మద్‌ బెన్‌టెన్‌ చెప్పారు. ‘హజ్‌ యాత్రకు ప్రతియేటా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలలో దాదాపు 25 లక్షల మంది వస్తుంటారు. అయితే ఈసారి కొంత మందినే అనుమతించాలనుకుంటున్నాం. అది 2000 మంది కావొచ్చు.. లేదా 1000 మంది కావొచ్చు’ అని తెలిపారు. 

కేంద్ర హజ్‌ కమిటీ సూచిస్తే..

హజ్‌ యాత్రను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కేంద్ర హజ్‌ కమిటీ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని తెలంగాణ హజ్‌ కమిటీ చైర్మన్‌ మహ్మద్‌ మసియుల్లా ఖాన్‌ తెలిపారు. ఈ ఏడాది హజ్‌ యాత్ర కోసం ఐదువేల మందిని ఎంపిక చేశామన్నారు. వచ్చే ఏడాది యాత్రకు వెళ్లే వారితోపాటు ఈ ఐదువేల మందిని కూడా పంపేలా చర్యలు తీసుకోవడంపై దృష్టిసారిస్తామని వివరించారు.


logo