శుక్రవారం 29 మే 2020
National - Feb 03, 2020 , 03:14:48

కరోనా.. హైరానా!

కరోనా.. హైరానా!

చైనాలో వెలుగుచూసిన ప్రాణాంతక కరోనా వైరస్‌ యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తున్నది. చిన్న జ్వరంగా మానవ శరీరంలోకి చేరి క్రమంగా ప్రాణాన్ని కబళిస్తున్నది. కరోనా ప్రభావంతో మృత్యు ఒడికి చేరుకుంటున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఇప్పటివరకు కరోనా వైరస్‌ 25 దేశాలకు విస్తరించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ జాబితాలో భారత్‌ కూడా ఉన్నది. ఈ వ్యాధి సోకినట్లు కేరళలో రెండో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. చైనా నుంచి వచ్చే పర్యాటకులకు ఈ-వీసాల మంజూరును తాత్కాలికంగా రద్దు చేశారు. మరోవైపు, చైనాలోని వుహాన్‌ నగరంలో చిక్కుకుపోయిన మరో 323 మంది భారతీయులను ప్రభుత్వం స్వదేశానికి తీసుకొచ్చింది. కరోనాతో చైనాలో ఇప్పటివరకూ 304 మంది చనిపోయారు. వైరస్‌ ఉద్ధృతి క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో చైనా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది. దేశంలోని వైరస్‌ ప్రభావిత నగరాల్లో నిషేధాజ్ఞలు విధించింది. దీంతో ఆయా నగరాల్లో కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తున్నది.

  • కేరళలో రెండో కేసు నమోదు.. బాధిత వ్యక్తికి ప్రత్యేక వార్డులో చికిత్స
  • 323 మంది భారతీయులు, ఏడుగురు మాల్దీవియన్లతో ఢిల్లీ చేరుకున్న రెండో విమానం
  • హుబెయి ప్రావిన్స్‌లో ఇంకా 100 మందికి పైగా భారతీయులు ఉన్నట్టు సమాచారం
  • చైనా నుంచి వచ్చే పర్యాటకులకు ఈ-వీసాలను రద్దు చేసిన భారత్‌
  • చైనాలో 304కి చేరిన మరణాలు
  • 76 వేల మందికి కరోనా వైరస్‌:హాంకాంగ్‌ పరిశోధకుల అంచనా

న్యూఢిల్లీ/తిరువనంతపురం/బీజింగ్‌, ఫిబ్రవరి 2: ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కరోనా వైరస్‌ భారత్‌లో కూడా చాపకింద నీరులా విస్తరిస్తున్నది. తాజాగా కేరళలో కరోనావ్యాధి రెండో కేసు నమోదైంది. వైరస్‌ సోకిన వ్యక్తి చైనా నుంచి ఇటీవలే భారత్‌కు వచ్చినట్టు అధికారులు గుర్తించారు. పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ) నుంచి వచ్చే నివేదిక కోసం ఎదురు చూస్తున్నట్టు కేరళ సర్కారు తెలిపింది. బాధిత వ్యక్తిని అలప్పుజా మెడికల్‌ కాలేజీ దవాఖానలో ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు రాష్ర్ట ఆరోగ్యశాఖ మంత్రి కే కే శైలజ తెలిపారు. బాధిత వ్యక్తి వుహాన్‌ వర్సిటీలో విద్యార్థి అని చెప్పారు. ఆ విద్యార్థి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు.


ఈ-వీసాలు రద్దు

కరోనా పరిణామాల నేపథ్యంలో చైనా రాజధాని బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం ఈ-వీసాల మంజూరును తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు ఆదివారం ప్రకటించింది. చైనా పాస్‌పోర్టులు కలిగి ఉన్నవారితోపాటు చైనాలో నివసిస్తున్న విదేశీయులకూ ఇది వర్తిస్తుందని తెలిపింది. ఇప్పటికే ఈ-వీసాలు జారిచేసిన వారికి అవి చెల్లవంటూ సమాచారం అందించినట్టు పేర్కొంది. ఎవరైనా కచ్చితంగా భారత్‌కు వెళ్లాల్సిన అవసరం ఉంటే తగిన కారణాలతో భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించవచ్చని సూచించింది. కాగా 323 మంది భారతీయులు, మరో ఏడుగురు మాల్దీవియన్లతో కూడిన ఎయిరిండియాకు చెందిన రెండో విమానం చైనా నుంచి ఆదివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నది. కరోనాకు కేంద్రబిందువైన హుబెయి ప్రావిన్స్‌లో ఇంకా 100 మందికి పైగా భారతీయులు ఉన్నట్టు అధికారులు అనుమాస్తున్నారు. కరోనా సోకి తమ దేశంలో ఓ వ్యక్తి చనిపోయినట్టు ఫిలిప్పీన్స్‌ ఆదివారం ప్రకటించింది. చైనా వెలుపల కరోనా కారణంగా నమోదైన మొదటి మరణం ఇదే. దీంతో కరోనాతో ఇప్పటివరకూ 305 మంది(304 చైనాలో, ఒక రు ఫిలిప్పీన్స్‌లో) ప్రాణాలు కోల్పోగా, 14,562 మం ది ప్రభావితమయ్యారు. ప్రస్తుతం ఈ వైరస్‌ భారత్‌, అమెరికా, యూకేతో పాటు మొత్తం 25 దేశాలకు విస్తరించింది.


రెండ్రోజులకొకసారి.. ఒక్కరు మాత్రమే!

కరోనాను కట్టడి చేసేందుకు చైనా పటిష్ఠమైన చర్యలకు ఉపక్రమించింది. వైరస్‌ సోకిన బాధితులను ప్రత్యేక ప్రాంతాల్లో ఉంచుతూ ఇతరులతో కలువకుండా గట్టి చర్యల్ని తీసుకుంటున్నది. ఇంకోవైపు, వ్యాధి ప్రభావిత ప్రాంతాలైన వుహాన్‌, వెన్‌జౌ లాంటి నగరాల్లో అధికారులు నిషేధాజ్ఞలు విధించారు. నిత్యావసర సరుకులను కొనుగోలు చేయడం కోసం ప్రతి ఇంటి నుంచి ఒక్క సభ్యున్ని మాత్రమే అధికారులు బయటకి అనుమతిస్తున్నారు. అదికూడా రెండ్రోజులకు ఒకసారి మాత్రమే. అధికారుల నిషేధాజ్ఞలతో ఆదివారం వెన్‌జౌ నగరంలోని రోడ్లు, వీధులు నిర్మానుష్యంగా మారి కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. 46 హైవే టోల్‌ స్టేషన్లను అధికారులు మూసివేశారు. మెట్రో రైలు సేవలు, ప్రజా రవాణాను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇప్పటివరకూ ఈ నగరంలో 265 మందికి వైరస్‌ సోకినట్టు అధికారులు గుర్తించారు. పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో తరగతుల్ని మార్చి 1 వరకు ప్రారంభించవద్దని అధికారులకు సూచించారు. ఫిబ్రవరి 17వరకు వ్యాపార సముదాయాలు మూసి ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. 


ప్రపంచంలో ఎక్కడున్నా మేమున్నాం: జైశంకర్‌ 

సమస్యల్లో ఉన్న భారతీయులను రక్షించడం తమ బాధ్యతని, వాళ్లు ప్రపంచంలో ఎక్కడున్నా పూర్తి సహా య సహకారాలు అందించడానికి మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఆదివారం పేర్కొన్నారు. ఢిల్లీలో జైశంకర్‌ మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడైనా ఒక్క భారతీయుడు కూడా సమస్యల్లో ఉన్నట్టు తెలిసినా, తమ ప్రభుత్వం వారిని రక్షించేందుకు తగిన చర్యల్ని తీసుకుంటుందని, దీనికోసం గత ఐదేండ్ల కాలంలో ఓ వ్యవస్థను అభివృద్ధి చేసినట్టు ఆయన పేర్కొన్నారు. 


76 వేల మందికి కరోనా వైరస్‌? 

చైనా ప్రభుత్వం ప్రకటించిన దానికంటే దాదాపు పది రెట్లు ఎక్కువగా అంటే 75,815 మందికి  కరోనా వైరస్‌ సోకినట్టు అంచనా వేస్తున్నామని వర్సిటీ ఆఫ్‌ హాంకాంగ్‌ పరిశోధకులు వెల్లడించారు. ఈ వివరాలు ప్రఖ్యాత వైద్య పత్రిక ‘లాన్సెట్‌'లో ప్రచురితమయ్యా యి. ‘జనవరి 25, 2020 నాటికి చైనాలోని వుహాన్‌ నగరంలో 75,815 మంది కరోనా వైరస్‌ ప్రభావానికి లోనైనట్టు భావిస్తున్నాం’ అని పరిశోధనకు నేతృత్వం వహించిన గాబ్రియెల్‌ ల్యూఎంగ్‌ పేర్కొన్నారు. అయితే, జనవరి 31 నాటికి చైనాలో 9,700 మందికి కరోనా వైరస్‌ సోకిందని, 213 మంది చనిపోయారని చైనా సర్కారు ప్రకటించడం తెలిసిందే.


logo