ఆదివారం 24 మే 2020
National - Mar 10, 2020 , 04:03:25

మరో ఆరుగురికి కరోనా

మరో ఆరుగురికి కరోనా

దేశంలో మరో ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, జమ్ముకశ్మీర్‌, పంజాబ్‌, కర్ణాటకలో ఒక్కొక్కరికి ఈ వైరస్‌ సోకినట్లు వైద్యులు గుర్తించారు. వీరిలో మూడేండ్ల చిన్నారి కూడా ఉన్నది.

  • బాధితుల్లో మూడేండ్ల చిన్నారి
  • కశ్మీర్‌, పంజాబ్‌, కర్ణాటకల్లో తొలి కేసు
  • 45కు పెరిగిన కేసులు

న్యూఢిల్లీ/ బీజింగ్‌/ లాస్‌ ఏంజిల్స్‌: దేశంలో మరో ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, జమ్ముకశ్మీర్‌, పంజాబ్‌, కర్ణాటకలో ఒక్కొక్కరికి ఈ వైరస్‌ సోకినట్లు వైద్యులు గుర్తించారు. వీరిలో మూడేండ్ల చిన్నారి కూడా ఉన్నది. కేరళకు చెందిన ఈ మూడేండ్ల చిన్నారి తల్లిదండ్రులతో కలిసి ఇటీవల ఇటలీ నుంచి భారత్‌కు వచ్చింది. కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో వీరికి థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేయగా చిన్నారికి వైరస్‌ లక్షణాలు ఉన్నట్లు బయటపడింది. ఆమె తల్లిదండ్రులకు కూడా ఈ వైరస్‌ సోకి ఉంటుందని వైద్యసిబ్బంది అనుమానిస్తున్నారు. వారి నుంచి సేకరించిన నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు.  అమెరికాలో సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి తన భార్య, కుమార్తెతో కలిసి కర్ణాటకకు వచ్చారని, ఆయనకు వైద్య పరీక్షలు చేయగా కరోనా సోకినట్లు బయటపడిందని తెలిపారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 45కు చేరిందని పేర్కొన్నారు. 


కాగా వైరస్‌ నేపథ్యంలో బెంగళూరు లోని అన్ని ప్రాథమిక పాఠశాలను నిరవధికంగా మూసివేయాలని అధికారులు ఆదేశించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు తెరువకూడదని సూచించారు. మరోవైపు ఆదివారం దుబాయ్‌ నుంచి కర్ణాటకలోని మంగళూరులో ఉన్న విమానాశ్రయానికి చేరుకున్న ఓ వ్యక్తి కరోనా (కొవిడ్‌-19) లక్షణాలతో బాధపడుతున్నట్లు గుర్తించిన సిబ్బంది అతడిని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. తనకు వైరస్‌ సోకలేదని సిబ్బందితో వాగ్వాదానికి దిగిన అతడు రాత్రి సమయంలో దవాఖాన నుంచి పారిపోయాడు. దీంతో అతడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇంకోవైపు ఇరాన్‌లో కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి సైన్యానికి చెందిన విమానం సోమవారం బయలుదేరింది. ఈజిప్టులోని నైలునది తీరంలో లంగరువేసిన క్రూయిజ్‌ నౌకలోని ప్రయాణికుల్లో 45 మంది కరోనా లక్షణాలతో బాధపడుతుండగా వారిని దవాఖానకు తరలించారు. ఈ నౌకలో తమిళనాడుకు చెందిన 17 మంది కూడా ఉన్నారు.


చైనాలో తగ్గుముఖం

చైనాలో కరోనా బాధితుల మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఆదివారం కేవలం 22 మరణాలు సంభవించాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు లక్షా పదివేలు దాటాయని, ఈ మహమ్మారి వల్ల ఇప్పటి వరకు 3,800 మందికిపైగా మరణించారని ఏజెన్సీ ఫ్రాన్స్‌ ప్రెస్‌ (ఏఎఫ్‌పీ) అనే వార్తా సంస్థ వెల్లడించింది.


మోదీ బంగ్లా పర్యటన రద్దు

ప్రధాని మోదీ బంగ్లాదేశ్‌ పర్యటన రద్దు అయ్యింది. ఈ నెల 17న బంగ్లాదేశ్‌ జాతిపిత షేక్‌ ముజిబర్‌ రెహమాన్‌ వందేండ్ల జయంతి వేడుకల ప్రారంభానికి హాజరుకావాలని తొలుత ఆయన నిర్ణయించారు. అయితే తమ దేశంలో ముగ్గురికి కరోనా వైరస్‌ సోకినట్లు గుర్తించిన బంగ్లాదేశ్‌.. ప్రారంభ వేడుకలను వాయిదా వేయాలని నిర్ణయించింది. వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ తన పర్యటనను రద్దు చేసుకున్నారు.


logo