శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Mar 23, 2020 , 00:53:04

170 దేశాలకు కరోనా

170 దేశాలకు కరోనా

-ప్రపంచవ్యాప్తంగా 13,444కు చేరిన మరణాలు.. 

-3 లక్షలు దాటిన వైరస్‌ కేసులు..

-లాక్‌డౌన్‌లో 35 దేశాలు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచంపై మరింత పట్టు బిగిస్తున్నది. మొత్తం 195 దేశాల్లో 170 దేశాలకు వైరస్‌ వ్యాపించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆదివారంకల్లా మృతుల సంఖ్య 13,444కు, వైరస్‌ సోకిన కేసుల సంఖ్య 3,08,130కు చేరింది. శనివారం నుంచి 1,702 కొత్త మరణాలు, 28,674 కేసులు నమోదయ్యాయి. 35 దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. దాదాపు అన్ని దేశాలు సరిహద్దులను మూసేసి అంతర్జాతీయ వి మానాల సర్వీసులను రద్దు చేశాయి. ప్రజలు ఇళ్లలోనే ఉండాలన్న కఠిన ఆంక్షలతో ఆదివారం ప్రపంచవ్యాప్తంగా సుమారు వంద కోట్ల మంది ఇండ్లకే పరిమితమయ్యారు. 

ఇటలీలో మరణమృదంగం

ఇటలీలో పరిస్థితి మరింత దారుణంగా ఉన్నది. ఆదివారం 651 మంది మృతితో మొత్తం మరణాల సంఖ్య 54,76కు, బాధితుల సంఖ్య 59,138కి చేరింది. కరోనా మరణాల్లో ఇటీవలే చైనాను దాటేసిన ఇటలీ ప్రస్తుతం తొలిస్థానంలో ఉన్నది. ఇక చైనా లో 3 రోజులకు తొలి కేసు వెలుగుచూసింది. దీంతో శనివారం నుంచి దేశవ్యాప్తంగా 46 కొత్త కేసులు నమోదుకాగా, ఆరుగురు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. మొత్తం మృతుల సంఖ్య 3,261కు, బాధితుల సంఖ్య 81,054కు చేరిందని, 72,244 మంది కోలుకున్నారన్నారు. కాగా విదేశీయుల నుంచి కరోనా  నియంత్రణకు సోమవారం నుంచి బీజింగ్‌కు వచ్చే అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను 12 ఇతర నగరాలకు మళ్లించనున్నట్లు పేర్కొంది. 

స్పెయిన్‌లో ఒక్కరోజులో 30 శాతం మరణాలు

స్పెయిన్‌లోనూ కరోనా కలకలం పెరుగుతున్నది. ఒక్కరోజులో మృతుల సంఖ్య 30% పెరిగింది. ఆదివారం కొత్తగా 394 మరణా లతో మృతుల సంఖ్య 1,756కి, కేసుల సం ఖ్య 28,603కు చేరడంతో ఆదివారంకల్లా ఇరాన్‌ను దాటి మూడోస్థానానికి చేరుకుంది. పరిస్థితి మరింత దిగజారొచ్చని స్పెయిన్‌ ప్రధాని పెడ్రో శాంచెజ్‌ హెచ్చరించారు. 4వ స్థానంలో ఉన్న ఇరాన్‌లో 123 కొత్త మరణాలు, 966 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మృతుల సంఖ్య 1,685కు , కేసుల సంఖ్య 21,638కి చేరుకున్నది. అయితే మరో 2 వారాల్లో పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహానీ తెలిపారు. కాగా, 562 మరణాలు, 14,459 కేసులతో ఫ్రాన్స్‌, 396 మరణా లు, 38,165 కేసులతో అమెరికా తర్వాత స్థానాల్లో ఉన్నాయి. సింగపూర్‌లో 23 కొత్త కేసులు నమోదుతో సంఖ్య 455కి చేరింది. ఆఫ్రికా దేశాల్లోనూ కరోనా కేసుల సంఖ్య వెయ్యి దాటింది. శనివారం నుంచి కొసావో, కొలంబియా, డీఆర్‌ కాంగో, రొమేనియా, చిలీ, సైప్రస్‌లలో తొలి కరోనా మరణాలు, అంగోలా, గాజా, తూర్పు తైమూర్‌, ఉగాండా, ఎరిట్రియాలో తొలిసారి కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 20కి చేరడంతో మార్చి 28 వరకు ఇరాక్‌ దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ప్రకటించింది. పాక్‌లో కరోనా కేసులు 730కి పెరగడంతో 2 వారాలు అంతర్జాతీయ విమాన సర్వీసులతోపాటు ఆ దేశంలో పలు రైళ్లను రద్దు చేసింది. logo