బుధవారం 03 జూన్ 2020
National - Apr 04, 2020 , 01:18:06

వారంలో 4 రెట్లు

వారంలో 4 రెట్లు

-దేశంలో విజృంభిస్తున్న కరోనా వైరస్‌

-మూడు వేలకు చేరువలో బాధితులు.. 84 మరణాలు 

న్యూఢిల్లీ: దేశంలో గత వారం రోజుల్లోనే కరోనా కేసులు, మరణాలు నాలుగు రెట్లు పెరిగాయి. మార్చి 27 నాటికి కరోనా బాధితుల సంఖ్య 724, మరణాలు 17 ఉండగా.. శుక్రవారం నాటికి 2,983కిపైగా కేసులు, 84 మరణాలు నమోదయ్యాయి. ఢిల్లీలోని తబ్లిగీ జమాత్‌ మత సమ్మేళనంలో పాల్గొన్న వారి ద్వారా వైరస్‌ చాపకింద నీరులా వ్యాపించడమే దీనికి కారణంగా తెలుస్తున్నది. గురువారం నుంచి శుక్రవారం వరకు 24 గంటల్లో దేశంలోని పలు రాష్ర్టాల్లో 380 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. దీంతో వైరస్‌ సోకిన వారి సంఖ్య 2,983కు, మృతుల సంఖ్య 84కు పెరిగినట్లు పేర్కొన్నారు. మర్కజ్‌లో పాల్గొన్న వారి వల్లే వైరస్‌ కేసులు ఒక్కసారిగా పెరిగాయన్నారు.  కరోనా లక్షణాలున్న వారిని గుర్తించేందుకు మహారాష్ట్ర 9 లక్షల మందిని సర్వే చేశారు. 

9వేల మందికి పరీక్షలు 

దేశవ్యాప్తంగా కరోనా పరీక్ష ల్యాబ్స్‌ సంఖ్య 180కి చేరినట్టు ఐసీఎంఆర్‌ తెలిపింది. గత 24 గంటల్లో దాదాపు తొమ్మిదివేల మందికి పరీక్షలకు నిర్వహించినట్లు వెల్లడించింది.  ఢిల్లీ వంటి నగరాల్లో ర్యాపిడ్‌ యాంటీబాడీ టెస్ట్‌ నిర్వహించాలని కేంద్రం సూచించింది. దేశంలో ఎలాంటి మందుల కొరత లేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్ష వర్ధన్‌ తెలిపారు. పది కోట్ల హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రల సరఫరాకు ఆర్డర్‌ ఇచ్చినట్లు చెప్పారు. ఐదు రోజుల్లో 15.4 టన్నుల వైద్య సామగ్రిని పలు రాష్ర్టాలకు తరలించామన్నారు. సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అన్ని రాష్ర్టాలకు కేంద్రం రూ. 17,287 కోట్లు విడుదల చేసింది. మరోవైపు ప్రపంచ బ్యాంకు భారత్‌కు బిలియన్‌ డాలర్ల(రూ.7.3వేల కోట్లు) సాయాన్ని ప్రకటించింది. 

వైద్యులపై దాడిచేస్తే కేసులు..

కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ర్టాలకు కేంద్ర హోంశాఖ ఆదేశించింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో వైద్య సిబ్బందిపై దాడి చేసిన నలుగురిపై జాతీయ భద్ర తా చట్టం కింద కేసులు నమోదు చేయగా, బెంగళూరులో సర్వే చేస్తున్న సిబ్బందిపై దాడి చేసిన ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. ఢిల్లీలో హోం క్వారంటైన్‌ నిబంధనలు ఉల్లంఘించిన 33 మందిపై కేసులు నమోదు చేశారు. పుణెలో ఓ వ్యక్తి తన భార్యకు కరోనా సోకిందంటూ  ఏప్రిల్‌ ఫూల్‌ చేయడానికి ప్రయత్నించగా కేసు నమోదు చేశారు. 

14 రాష్ర్టాలకు తబ్లిగీ సంక్షోభం 

ఢిల్లీలో మొదలైన నిజాముద్దీన్‌ తబ్లిగీ  సంక్షోభం 14 రాష్ర్టాలకు విస్తరించింది. గత రెండు రోజుల్లో వెలుగుచూసిన 647 కరోనా పాజిటివ్‌ వ్యక్తులందరూ ఢిల్లీలో జరిగిన తబ్లిగీకి హాజరైన వారేనని కేంద్రం తెలిపింది. ఈ కేసులు 14 రాష్ర్టాల్లో నమోదయ్యాయని చెప్పింది. మొత్తంగా సదస్సుకు హాజరైనవారిలో ఇప్పటివరకు 750 మందికిపైగా వైరస్‌ సోకిందన్నారు. దేశంలో నమోదైన కేసుల్లో ఇవి 25 శాతానికిపైనేనని వెల్లడించింది. మరోవైపు నిజాముద్దీన్‌ తబ్లిగీకి నిధులు ఎక్కడ నుంచి వస్తున్నాయన్న విషయమై కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయని సమాచారం. గల్ఫ్‌ దేశాల నుంచే భారీగా నిధులు వస్తున్నాయని తేలింది. తబ్లిగీ అధిపతి మౌలానా సాద్‌ను పోలీసులు ప్రశ్నించారు. 

రెండు జిల్లాల్లో 48 గంటలు షట్‌డౌన్‌

ఒడిశాలోని భువనేశ్వర్‌, భద్రక్‌ జిల్లాల్లో శుక్రవారం రాత్రి నుంచి 48 గంటల పాటు కర్ఫ్యూ తరహా షట్‌డౌన్‌ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం నిత్యావసరాలు, పాలు, కూరగాయల సరఫరాను సైతం నిలిపివేస్తారు. ఎంపిక చేసిన మెడికల్‌ షాపులను మాత్రమే తెరిచి ఉంచుతారు. 


logo