గురువారం 16 జూలై 2020
National - Jun 24, 2020 , 02:48:42

కరోనాకు ‘పతంజలి’ ఔషధం

కరోనాకు ‘పతంజలి’ ఔషధం

  • ఏడు రోజుల్లోనే వ్యాధి నయం: రాందేవ్‌
  • ధర రూ. 545.. వారంలో అందుబాటులోకి
  • ఔషధ సామర్థ్యం తెలిసే వరకూ ప్రచారం వద్దు: ఆయుష్‌

హరిద్వార్‌/న్యూఢిల్లీ: కరోనా మహమ్మారికి తొలిసారిగా ఆయుర్వేద ఔషధాన్ని తీసుకొచ్చినట్టు ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌కు చెందిన ‘పతంజలి’ సంస్థ పేర్కొంది. ‘కోరొనిల్‌' పేరుతో తీసుకొచ్చిన ఈ కరోనా కిట్‌లో కోరొనిల్‌, శ్వాసరి, అనుతేల్‌ అనే మూడు రకాల ఔషధాలు ఉంటాయని తెలిపింది. కరోనా రోగులపై నిర్వహించిన ఔషధ పరీక్షల్లో కోరొనిల్‌, శ్వాసరి ఔషధాలు వంద శాతం సత్ఫలితాలను ఇచ్చాయని వెల్లడించింది. హరిద్వార్‌లో మంగళవారం నిర్వహించిన ఔషధం ఆవిష్కరణ కార్యక్రమంలో రాందేవ్‌ మాట్లాడుతూ.. 

‘ఈ ఔషధాన్ని వాడటం ద్వారా ఏడు రోజుల్లోనే సంపూర్ణంగా కోలుకోవచ్చు. పరీక్షల్లో భాగంగా ఈ ఔషధాన్ని 280 మంది రోగులపై ప్రయోగించాం. 69% మంది మూడు రోజుల్లోనే కోలుకున్నారు. మిగిలిన నాలుగురోజుల్లో ఇతరులూ  పూర్తిగా బయటపడ్డారు. కరోనా కిట్‌లో 30 రోజులకు అవసరమైన మందులు ఉంటాయి. వచ్చే సోమవారం నుంచి  ఇవి అందుబాటులో ఉంటాయి. అవసరమైన వాళ్లు ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇవ్వాలి’ అని చెప్పారు. ఈ కరోనా కిట్‌ ధర రూ.545.


వారంలో వ్యాధి నయం.. అసాధ్యమే: వైద్య నిపుణులు

పతంజలి ఔషధంతో ఏడు రోజుల్లోనే కరోనా నయం అవుతుందన్న సంస్థ ప్రకటనను వైద్య నిపుణులు తోసిపుచ్చుతున్నారు. శరీరంలోని వైరల్‌ లోడ్‌ను ఐదు నుంచి ఏడు రోజుల్లో తీసివేయడం ఏ ఔషధానికి సాధ్యంకాదని ఫరీదాబాద్‌లోని ఫోర్టీస్‌ ఎస్కార్ట్స్‌ దవాఖాన వైద్యుడు డాక్టర్‌ శేఖర్‌ ఝా అభిప్రాయపడ్డారు. ఇదిలాఉండగా, కొవిడ్‌-19 నివారణ కోసం తీసుకొచ్చిన ఔషధానికి సంబంధించిన సమాచారాన్ని, పరిశోధన వివరాల్ని ఇవ్వాలని పతంజలి సంస్థను ఆయుష్‌ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఔషధం సామర్థ్యాన్ని నిరూపించే పరీక్షలు నిర్వహించే వరకూ ప్రచారాన్ని నిలిపివేయాలని సూచించింది.


logo