e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home జాతీయం గాలిలో కరోనా

గాలిలో కరోనా

గాలిలో కరోనా
  • రోగి చుట్టూ మూడు మీటర్ల వరకూ వ్యాప్తి
  • దగ్గినా, తుమ్మినా, పాడినా గాలిలోకి వైరస్‌
  • మహమ్మారి విస్తరణకు ప్రధాన కారణమిదే
  • సైలెంట్‌ ట్రాన్స్‌మిషన్‌ వల్లే 40 శాతం కేసులు
  • గదిలోనే ప్రమాదం ఎక్కువ
  • లాన్సెట్‌లో ప్రచురితమైన అధ్యయనంలో వెల్లడి
  • మూసి ఉన్న గదుల్లో 20 అడుగుల్లో విస్తరణ
  • సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా ధ్రువీకరణ

వరుసగా రెండో ఏడాది భారత్‌తోపాటు పలు ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి గాలి ద్వారానే వ్యాపిస్తున్నది. కరోనా రోగి తుమ్మినా, దగ్గినా, శ్వాసించినా, మాట్లాడినా అతని నోటి తుంపర్ల ద్వారా వైరస్‌ గాలిలోకి ప్రవేశించి ఇతరులకు సోకుతున్నది. రోగి చుట్టూ వైఫైలా ఆరు అడుగుల నుంచి 20 అడుగుల దూరం వరకు వైరస్‌ విస్తరించి ఉంటున్నది. ఇండ్లల్లో ఉన్నప్పుడు కూడా నాణ్యమైన మాస్కులను ధరించడం, గుంపులోకి వెళ్లకపోవడం, గాలి, వెలుతురు ఎక్కువగా ఉండే గదులలో నివసించడం ద్వారానే వైరస్‌ను నివారించవచ్చని సీసీఎంబీతోపాటు బ్రిటన్‌, అమెరికా, కెనడాకు చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

ప్రత్యేక ప్రతినిధి, ఏప్రిల్‌ 16 (నమస్తే తెలంగాణ): ప్రపంచ దేశాలను ముప్పుతిప్పలు పెడుతున్న కరోనా వైరస్‌ ప్రధానంగా గాలి ద్వారానే వ్యాపిస్తున్నదని తాజా అధ్యయనం పేర్కొంది. బ్రిటన్‌, అమెరికా, కెనడాకు చెందిన పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనం వివరాలు ప్రఖ్యాత వైద్యపత్రిక ‘లాన్సెట్‌’లో ప్రచురితమయ్యాయి. హైదరాబాద్‌లోని సీసీఎంబీ కూడా దీనిని ధ్రువీకరించింది. మహమ్మారి వ్యాప్తిలో సైలెంట్‌ ట్రాన్స్‌మిషన్‌ (గాలి ద్వారా వ్యాప్తి చెందడం) ప్రధాన పాత్ర పోషిస్తున్నదని పరిశోధకులు తెలిపారు. ఇందుకు పది ఆధారాలను వారు పేర్కొన్నారు. ‘కరోనా సోకిన వ్యక్తి తుమ్మడం, దగ్గడంతో పాటు శ్వాసించడం, మాట్లాడటం, అరవడం, పాడటం వంటి పనులు చేసినప్పుడు వైరస్‌ గాలిలోకి ప్రవేశిస్తుంది. అది రెండు నుంచి మూడు మీటర్ల వరకు ఆవరించి ఉంటుంది. ఈ గాలిని పీల్చిన వారు మహమ్మారిబారిన పడతారు’ అని వెల్లడించారు. ప్రపంచ దేశాలను కరోనా చుట్టిరావడానికి ఈ సైలెంట్‌ ట్రాన్స్‌మిషనే కారణమని వాళ్లు పేర్కొన్నారు. పెద్ద తుంపర్ల ద్వారా వైరస్‌ సులభంగా వ్యాపిస్తుందనడానికి సరైన ఆధారాలు లేవని వెల్లడించారు. ‘కేసులు పెరుగడానికి గాలి ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందడమే ప్రధాన కారణం’ అని యూనివర్సిటీ ఆఫ్‌ కొలరాడో శాస్త్రవేత్త జోస్‌ లూయిస్‌ జిమ్‌నెజ్‌ పేర్కొన్నారు. ప్రజలు ఇండ్లల్లో ఉన్నప్పుడు కూడా నాణ్యమైన మాస్కులను ధరించడం, గుంపులోకి వెళ్లకపోవడం, వెంటిలేషన్‌, ఎయిర్‌ఫిల్టరేషన్‌ ఉన్న గదులను వినియోగించడం, రోగులకు చికిత్స అందించే వైద్య సిబ్బంది హైగ్రేడ్‌ పీపీఈ కిట్లను వాడటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బయట ప్రాంతాలతో పోలిస్తే, గదిలోపలే వైరస్‌ సులభంగా వ్యాప్తి చెందుతుందని, గదిలో సరైన వెంటిలేషన్‌ ఉండేలా చూసుకోవాలని సూచించారు. కరోనా రోగిని ఓ సాధారణ వ్యక్తి కలుసుకోకపోయినా క్వారంటైన్‌ హోటల్‌లో పక్క గదిలోనే నివసించడం వల్ల వ్యాధికి గురైన సంఘటన తమ పరిశీలనలో వెల్లడైందని వారు పేర్కొన్నారు. సూపర్‌ స్ప్రెడర్స్‌ (సామూహిక కార్యక్రమాలలో ఒకరి నుంచి ఎక్కువమందికి వ్యాపించడం) ద్వారా వ్యాధి వేగంగా విస్తరిస్తున్నదని తెలిపారు. మొత్తం కేసులలో 33 నుంచి 59శాతం మంది అస్టిమాటిక్‌ (వ్యాధికి గురైనప్పటికీ లక్షణాలు లేనివారు) వ్యక్తుల ద్వారా వ్యాధికి గురవుతున్నారని పేర్కొన్నారు. దవాఖానల్లో పీపీఈ కిట్లు వేసుకున్న సిబ్బంది సైతం వైరస్‌ బారిన పడుతున్నారని తెలిపారు. గాలిద్వారా వైరస్‌ వ్యాపిస్తున్నదనడానికి ఇవన్నీ ఉదాహరణలని వివరించారు.

పబ్లిక్‌ టాయ్‌లెట్లు, దవాఖానలు వైరస్‌ వాహకాలు : సీసీఎంబీ

కరోనా రోగులుండే ప్రాంతంలో రెండు నుంచి మూడుమీటర్ల వరకు వైరస్‌ విస్తరించి ఉంటుందని సీసీఎంబీ తెలిపింది. గాలి ఆడని గదులు, ఏసీ రూముల్లో వైరస్‌ 20 అడుగుల వరకు విస్తరించే ప్రమాదముంటుందని సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా చెప్పారు. ఇక పబ్లిక్‌ టాయ్‌లెట్లు, దవాఖానలు, నలువైపులా మూసి ఉన్న ప్రదేశాల్లో వైరస్‌ ముప్పు అధికంగా ఉంటుందని తెలిపారు. వెంటిలేషన్‌ లేకుండా మూసిఉన్న గదులలో వైరస్‌ 20 అడుగుల వరకు గాలిలో విస్తరించి ఉన్నట్టు తాము గుర్తించినట్టు రాకేశ్‌మిశ్రా తెలిపారు. వైరస్‌ సోకిన వ్యక్తి గాలి, వెలుతురు సరిగ్గా లేని గదులలో ఎక్కువ సేపు గడిపిన వెళ్లిన తర్వాత రెండు గంటల వరకు అక్కడ గాలిలో వైరస్‌ ఉన్నట్టు తాము గమనించామని వెల్లడించారు. హైదరాబాద్‌లో మూడు ప్రముఖ దవాఖానలు, చండీగఢ్‌లోని మరో మూడు ఎక్కువ రద్దీ కలిగిన దవాఖానలు కేంద్రంగా సీసీఎంబీ బృందం పరిశోధన నిర్వహించింది. కొన్ని ప్రాంతాలలో తక్కువ విస్తీర్ణం కలిగిన క్లోజ్డ్‌ రూమ్‌లను కూడా పరిశీలించింది. రోగుల నోటి తుంపరుల ద్వారా వెలువడిన వైరస్‌ గాలిలో ధూళి కణాలలో కలిసి ప్రయాణిస్తున్నట్లు ఆ బృందం గుర్తించింది.

మాస్క్‌ సోషల్‌ వ్యాక్సిన్‌: రాకేశ్‌మిశ్రా

గాలి, వెలుతురు సరిగ్గాలేని చిన్న గదులు, దవాఖానలు, పబ్లిక్‌ టాయ్‌లెట్లు ఉన్న ప్రాంతాల వద్ద గాలిలో వైరస్‌ విస్తృతంగా వ్యాపించింది. ఇటువంటి ప్రాంతాలలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మాస్క్‌ సోషల్‌ వ్యాక్సిన్‌, దానిని ఇటువంటి చోట్ల తప్పనిసరిగా ధరించాలి. ఇండ్లలో కూడా ప్రతి గదిలో గాలి, వెలుతురు బాగా ఉండే విధంగా ఏర్పాటుచేసుకోవాలి. కరోనా సోకినట్లు అనుమానాలున్న వ్యక్తులను కుటుంబసభ్యుల నుంచి వేరుగా ఉంచి సపర్యలు చేయాలి. మాస్క్‌ అనేది రక్షణ కవచం అన్న విషయాన్ని మరిచి పోకూడదు.

Advertisement
గాలిలో కరోనా
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement