శుక్రవారం 30 అక్టోబర్ 2020
National - Oct 18, 2020 , 01:05:07

4 దశలుగా కరోనా టీకాలు

4 దశలుగా కరోనా టీకాలు

  • పంపిణీపై ప్రధాని మోదీ సమీక్ష

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన వెంటనే ప్రజలకు వ్యాక్సినేషన్‌ (టీకాలు వేయటం) కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ముందుగా ఎవరికి టీకాలు వేయాలన్న అంశంపై తుది నిర్ణయానికి వచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వ్యాక్సినేషన్‌ సన్నద్ధతపై ఉన్నతాధికారులతో ప్రధాని నరేంద్రమోదీ శనివారం సమీక్ష నిర్వహించారు. విపత్తు, ఎన్నికల నిర్వహణల్లాగానే వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో అన్నివర్గాలను భాగస్వాములను చేయాలని ఆదేశించారు.  

వారియర్స్‌కు ప్రాధాన్యం

కొవిడ్‌-19 టీకా అందుబాటులోకి రాగానే వ్యాక్సినేషన్‌ ప్రారంభించేందుకు ప్రజలను నాలుగు వర్గాలుగా విభజించారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేసే వైద్యులు, వైద్య సిబ్బందికి మొదట టీకాలు వేస్తారు. ఆ తర్వాత రెండు కోట్లమంది పోలీస్‌, మున్సిపల్‌, ఇతర భదత్రాబలగాల సిబ్బందికి వ్యాక్సినేషన్‌ ఉంటుంది. మూడో దశలో 50 ఏండ్లు పైబడిన 2 కోట్లమందికి టీకాలు వేస్తారు. నాలుగో దశలో 50 ఏండ్లలోపు ప్రజలందరికీ టీకాలు వేస్తారు.