గురువారం 04 జూన్ 2020
National - Mar 29, 2020 , 00:44:54

కోటి మందిలో ఏడుగురికి!

కోటి మందిలో ఏడుగురికి!

  • 130 కోట్ల దేశజనాభాలో 929 మందికి కరోనా
  • అమెరికా, ఇటలీ, స్పెయిన్‌లలో విపరీత వ్యాప్తి
  • చైనాలో 10 లక్షల మందిలో 57 మంది బాధితులు

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి.. విశ్వమారిగా మారి కరాళనృత్యం చేస్తున్నది. అగ్రరాజ్యం అమెరికా సహా, ఇటలీ, స్పెయిన్‌, ఇరాన్‌, బ్రిటన్‌ ఫ్రాన్స్‌.. ఇలా ఒక్కో దేశంపై విరుచుకుపడుతున్నది. ఆయా దేశాలతో పోల్చితే భారత్‌లో పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉన్నది. 130 కోట్ల మంది జనాభా ఉన్న మన దేశంలో.. ఇప్పటివరకు 929 మందికి మాత్రమే వైరస్‌ సోకింది. దీనిని బట్టి.. ప్రతి కోటి మందిలో దాదాపు ఏడుగురికి మాత్రమే కరోనా సోకింది. మిలియన్‌ (10 లక్షలు) జనాభాకు లెక్కిస్తే ఇది 0.7 మంది మాత్రమే బాధితులు. అయితే సమూహవ్యాప్తి దశకు చేరకముందే వైరస్‌ను కట్టడి చేయగలిగితేనే విశ్వమారి కాటు నుంచి మనం తప్పించుకోగలుగుతామని నిపుణులు చెప్తున్నారు. లేదంటే ఇటలీ, అమెరికా మాదిరి తిప్పలు తప్పవని స్పష్టం చేస్తున్నారు. చైనాలో ప్రతి మిలియన్‌ జనాభాలో 57 మంది వైరస్‌ బారిన పడగా.. అమెరికా, ఇటలీ, స్పెయిన్‌లో ఈ నిష్పత్తి వరుసగా 315, 1431, 1545గా ఉండటం గమనార్హం. 

న్యూఢిల్లీ: కరోనా విశ్వమారి ఒక్కో దేశంపై విరుచుకుపడుతున్నది. అయితే మిగతా దేశాలతో పోల్చితే మాత్రం.. భారత్‌లో పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉన్నది. దేశంలో 929 కేసులు నమోదయ్యాయి. కేసులు/జనాభా నిష్పత్తి ఆధారంగా విశ్లేషిస్తే.. మన దేశంలో ప్రతి 10 లక్షల మందిలో 0.7 మందికి మాత్రమే వైరస్‌ సోకింది. అంటే.. కోటి మందిలో ఏడుగురు బాధితులు ఉన్నట్టు లెక్క. సమూహవ్యాప్తి దశకు చేరకముందే వైరస్‌ను కట్టడి చేస్తేనే సురక్షితంగా ఉంటామని నిపుణులు చెప్తున్నారు. ఇందుకు అనుగుణంగా కేంద్రం లాక్‌డౌన్‌తోపాటు అనేక ఏర్పాట్లు చేస్తున్నది. రైలుబోగీల్లో ఐసొలేషన్‌వార్డులు

వైద్యసదుపాయాలు లేని ప్రాంతాల్లో కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు రైల్వేశాఖ ప్రత్యేకంగా ‘ఐసొలేషన్‌ బోగీల’ను తయారుచేస్తున్నది. ఓ జనరల్‌ బోగీని ఐసొలేషన్‌ వార్డుగా మార్చిన చిత్రాలను శనివారం మీడియాకు విడుదలచేసింది. ప్రతి రైల్వేజోన్‌లో ప్రతివారం పది బోగీల్లో ఐసోలేషన్‌వార్డులు ఏర్పాటుచేస్తామని వెల్లడించింది. మధ్య, పక్క బెర్తులను తొలిగించి ఒక్కోకూపెలో ఇద్దరు నుంచి నలుగురు ఉండేలా ఏర్పాటుచేశారు. ఒక రోగి గాలి మరొకరికి తగులకుండా మధ్యలో కర్టెన్లు పెడతారు. ప్రతికోచ్‌లోని నాలుగు మరుగుదొడ్లను రెండు బాత్‌రూమ్‌లుగా మారుస్తారు. ఇందులో హ్యాండ్‌షవర్‌, బకెట్‌, మగ్‌ ఉంటాయి. రోగుల వార్డులతోపాటు కన్సల్టేషన్‌ గదులు, మెడికల్‌ స్టోర్‌, ఐసీయూ, చిన్నగదుల వంటి సౌకర్యాలు ఏర్పాటుచేస్తారు.logo