సోమవారం 25 మే 2020
National - Apr 02, 2020 , 22:48:17

కాలుష్యాన్ని తగ్గించిన లాక్‌డౌన్‌

కాలుష్యాన్ని తగ్గించిన  లాక్‌డౌన్‌

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ ఓవైపు దేశాన్ని వణికిస్తున్నా.. మరోవైపు గాలి కాలుష్యాన్ని తగ్గించింది. లాక్‌డౌన్‌ మొదలైననాటి నుంచి వాయునాణ్యతలో గణనీయమైన మార్పు కనిపించిందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (పీసీబీ) తెలిపింది. మార్చి 29వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా 91 నగరాల్లో పరిస్థితి మెరుగుపడిందని వెల్లడించింది. సాధారణంగా రవాణా, పరిశ్రమలు, విద్యుదుత్పత్తి ప్లాంట్లు, నిర్మాణ పనులు, వ్యర్థాల కాల్చివేత, రోడ్లపై ఉండే దుమ్ము వంటివి గాలి కాలుష్యానికి ప్రధాన కారకాలు. జనతా కర్ఫ్యూ, 21 రోజుల లాక్‌డౌన్‌ కారణంగా అత్యవసర విభాగాలు మినహా అన్నీ మూతపడ్డాయి.

 దీంతో గాలిలోకి కలుషితాలు చేరడం తగ్గిపోయి, వాయు నాణ్యత పెరిగిందని పీసీబీ వెల్లడించింది. జనతా కర్ఫ్యూకు ముందురోజు (మార్చి 21న) దేశవ్యాప్తంగా 54 నగరాల్లో మాత్రమే వాయు నాణ్యత ‘బాగుంది, సంతృప్తికరం’ స్థాయిల్లో ఉండేది. మార్చి 29 నాటికి నగరాల సంఖ్య 91కి పెరిగింది. ఇందులో 61 నగరాల్లో గాలి నాణ్యత ‘సంతృప్తికరం’గా ఉండగా, 30 నగరాల్లో ‘బాగుంది’ స్థాయికి చేరింది. ముఖ్యంగా జనతా కర్ఫ్యూకు ముందు తొమ్మిది నగరాల్లో గాలికాలుష్యం తీవ్రంగా ఉండగా, ప్రస్తుతం అవన్నీ మెరుగుపడ్డాయని పీసీబీ వెల్లడించింది. 


logo