మంగళవారం 22 సెప్టెంబర్ 2020
National - Aug 08, 2020 , 17:32:30

నోయిడాలో 400 పడకలతో కరోనా ప్రత్యేక దవాఖాన ప్రారంభం

నోయిడాలో 400 పడకలతో కరోనా ప్రత్యేక దవాఖాన ప్రారంభం

గౌతమ్‌ బుద్ధ నగర్‌ : ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ర్టం గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా నోయిడాలోని సెక్టార్ 39లో 400 పడకల కరోనా ప్రత్యేక దవాఖానను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ ఈ రోజు గౌతమ్ బుద్ధ నగర్‌లో ప్రత్యేకంగా కరోనా రోగుల కోసం దవాఖానను ప్రారంభించామన్నారు. కరోనాతో పోరాటం కొనసాగుతోందని, ఇందులో మొదట గౌతమ్‌బుద్ధ నగర్‌, ఎన్‌సీఆర్‌ ప్రాంతాలు అతిపెద్ద సవాలుగా మారాయన్నారు. ఢిల్లీ కారణంగా రాష్ర్టంలో కరోనా కేసుల ఉధృతి పెరిగిందని ఆయన పేర్కొన్నారు. 

ప్రతి జిల్లాలో తమకు లెవల్‌-1 దవాఖానలున్నాయని, లెవల్-2 దవాఖానలు కూడా అక్కడక్కడ ఉన్నాయని లేని చోట రాబోయే 15 రోజుల్లో స్థాపిస్తామన్నారు. ఈ రోజు ఒక దవాఖాన ప్రారంభించబడిందని, రెండవది మరో 10 నుంచి 12 రోజుల్లో గోండాలో ప్రారంభమవుతుందని వెల్లడించారు. కరోనా ప్రత్యేక దవాఖానల్లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. 

ప్రభుత్వ దవాఖాన ప్రారంభానికి సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యటనకు ముందు నోయిడాలో 144 సెక్షన్ విధించినట్లు పోలీసులు తెలిపారు. 15 మంది గెజిటెడ్ అధికారులు, విధుల్లో ఉన్న 700 మంది కానిస్టేబుళ్లు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఏడీసీపీ రణవిజయ్‌ సింగ్‌ సూచించారు. 


logo