సోమవారం 10 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 00:38:37

కరోనా.. ‘పాజిటివ్‌'!

కరోనా.. ‘పాజిటివ్‌'!

  • l సీజనల్‌ వ్యాధులను కట్టడి చేసిన కరోనా జాగ్రత్తలు 
  • l మాస్కు, భౌతికదూరంతో అంటువ్యాధులు పరార్‌ 
  • l ఇన్‌ఫ్ల్యూయెంజా, హెచ్‌ఐవీ, క్షయ, హెపటైటిస్‌, తట్టు తగ్గుముఖం

న్యూఢిల్లీ: వెలుగునీడల్లాగా ప్రతీ పరిణామానికీ మంచీచెడూ ఉంటాయి. కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తున్నప్పటికీ.. దాంతో ఓ మేలు కూడా జరుగుతున్నది. ఇదో కొత్త కోణం. కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న లాక్‌డౌన్‌, భౌతికదూరం, ముఖానికి మాస్కు, చేతులను తరచూ శుభ్రం చేసుకోవటం వంటి జాగ్రత్తలు ఈ సమయంలో ప్రబలే ఇన్‌ఫ్ల్యూయెంజా వంటి అంటువ్యాధులను పెద్దమొత్తంలో కట్టడి చేశాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతో ఇప్పటికే కొవిడ్‌-19 కేసులతో సతమతమవుతున్న వైద్య వ్యవస్థపై పెద్ద భారం తప్పినట్లయ్యిందని పేర్కొంటున్నారు.

అంటువ్యాధులు 90 శాతం తగ్గాయి

కరోనా వైరస్‌ తొలిసారిగా వెలుగుచూసిన చైనాలో లాక్‌డౌన్‌ చర్యలు చేపట్టక ముందు దేశంలో సగటున నెలకు 2.9 లక్షల అంటువ్యాధుల కేసులు రికార్డు అయ్యేవని, లాక్‌డౌన్‌ తదనంతర కాలంలో వీటి సంఖ్య 23 వేలకు పడిపోయిందని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొత్తంగా చూస్తే అంటువ్యాధులు 90 శాతం కంటే ఎక్కువ తగ్గాయన్నారు. ఇతర దేశాల్లోనూ ఈ రకమైన సానుకూల పరిస్థితులే నెలకొన్నాయి. కరోనా కట్టడికి తీసుకున్న జాగ్రత్తలతో ఇన్‌ఫ్ల్యూయెంజా కేసులు గణనీయంగా తగ్గాయని కెనడా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా కూడా పేర్కొన్నాయి. దక్షిణ కొరియాలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అంటువ్యాధులు 83 శాతం మేర తగ్గినట్టు ఇటీవల ఓ నివేదిక వెల్లడించింది. సీజనల్‌గా వచ్చే ఇన్‌ఫ్ల్యూయెంజాతో ఏటా 5 లక్షల మంది మరణిస్తుండగా, 30 లక్షల నుంచి 50 లక్షల మంది వ్యాధి ప్రభావానికి తీవ్రంగా లోనవుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అంచనా. ప్రస్తుత మార్పుతో ఈ సంఖ్య గణనీయంగా తగ్గిపోయినట్లు తెలుస్తున్నది.

వ్యాధి నిరోధకత తగ్గితే.. సమస్యే!

సీజనల్‌ వ్యాధుల్లో తగ్గుదల ఇమ్యూనిటీపై ప్రభావం చూపవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి అంటువ్యాధులు ప్రబలలేదు కాబట్టి వచ్చే ఏడాది వాటి ప్రభావం ఎక్కువగా ఉండవచ్చన్నారు.

భారత్‌లోనూ తగ్గుముఖం! 

దేశంలో ఎండాకాలంతో (ఫిబ్రవరి-మే)తో పోలిస్తే వర్షకాలం (జూన్‌-సెప్టెంబర్‌) సీజన్‌లో అంటువ్యాధుల విజృంభణ ఎక్కువగా ఉంటుంది. అయితే, కరోనా నేపథ్యంలో ప్రజలు ముఖానికి మాస్కులు ధరించడం, భౌతిక దూరం వంటి నియమాలను పాటించడం వల్ల ఫ్లూ, శ్వాసకోశకు సంబంధించిన వ్యాధులు భారత్‌తో పాటు దక్షిణార్ధ గోళంలోని దేశాల్లో తక్కువగా ప్రబలవచ్చని వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ గతవారం పేర్కొంది.


logo