సోమవారం 06 జూలై 2020
National - Jun 03, 2020 , 01:08:06

దేశంలో కరోనా పాజిటివ్‌ రోగుల సంఖ్య రెండు లక్షలకు చేరువైంది

దేశంలో కరోనా పాజిటివ్‌ రోగుల సంఖ్య రెండు లక్షలకు చేరువైంది

  • 14 రోజుల్లోనే నమోదైన మరో లక్ష కేసులు
  • మహారాష్ట్రలోనే 70 వేలు దాటిన రోగులు
  • తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్‌లలో తీవ్రత ఎక్కువ

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్‌ రోగుల సంఖ్య రెండు లక్షలకు చేరువైంది. సోమవారం నుంచి మంగళవారం వరకు 24 గంటల్లో 8,171 మందికి పాజిటివ్‌ అని నిర్ధారణైందని, దీంతో వైరస్‌ బారిన పడినవారి  సంఖ్య 1,98,706కు చేరుకున్నదని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. అయితే వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం కరోనా కేసుల సంఖ్య 2,00,321కి చేరిందని పీటీఐ వార్తా సంస్థ మంగళవారం రాత్రి తెలిపింది.  మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్‌లతో కలిపి 131,542 కేసులుండగా, మిగతా రాష్ర్టాల్లో 67,164 రికార్డయ్యాయి. 

భారత్‌లో కరోనా కేసులు లక్ష మార్కును చేరుకోవడానికి 64 రోజులు పట్టింది. జనవరి 30న తొలి కేసు నమోదు కాగా, మే 19న కేసులు లక్ష దాటాయి. జూన్‌ 2 నాటికి అంటే కేవలం 14 రోజుల్లోనే   మరో లక్ష మందికి కరోనా సోకినట్లయింది. మే 19న మరణాల సంఖ్య 3,163గా ఉంటే జూన్‌ 2న 5,598కి చేరింది. 14 రోజుల్లో 2435 మరణాలు నమోదయ్యాయి. కాగా, ఇప్పటి వరకు 95,526 మంది (48.07) రోగులు కోలుకున్నారు. మహారాష్ట్రలో వైరస్‌ కేసులు 70 వేలు దాటాయి. గత 24 గంటల్లో 204 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 5,598కి చేరింది. 


logo