రూ.25వేల నుంచి 50 కోట్లదాకా లోన్లు
న్యూఢిల్లీ, మే 28: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ కెనరా బ్యాంక్.. కరోనా వైరస్ నేపథ్యంలో శుక్రవారం మూడు రుణ పథకాలను ప్రకటించింది. హెల్త్‌కేర్ క్రెడిట్, వ్యాపార రుణాలు, వ్యక్తిగత రుణాలను ఆఫర్ చేసింది. ఈ స్కీంల ద్వారా కనిష్ఠంగా రూ.25వేలు, గరిష్ఠంగా రూ.50 కోట్ల వరకు రాయితీ వడ్డీరేటుకే రుణాలిచ్చేందుకు ముందుకు వచ్చింది.
చికిత్స హెల్త్‌కేర్ క్రెడిట్
ఈ పథకం ద్వారా రూ.10 లక్షల నుంచి 50 కోట్ల వరకు రుణ సదుపాయం పొందవచ్చు. గుర్తింపు పొందిన దవాఖానలు, నర్సింగ్ హోంలు, వైద్యులు, డయాగ్నస్టిక్ సెంటర్లు, పాథాలజీ ల్యాబ్‌లు తదితర ఆరోగ్య సంరక్షణ రంగంలోని అన్నింటికీ ఈ లోన్లకు అర్హత ఉంటుంది. రుణ కాలపరిమితి 10 ఏండ్ల వరకు ఉన్నది. 18 నెలల వరకు మారటోరియం కూడా వర్తిస్తుంది. వచ్చే ఏడాది మార్చి ఆఖరుదాకా ఈ లోన్ అందుబాటులో ఉంటుంది.
జీవన్‌రేఖ హెల్త్‌కేర్ బిజినెస్ లోన్
ఈ స్కీంపై రూ.2 కోట్ల వరకు రుణాలను పొందవచ్చు. నమోదిత దవాఖానలు, నర్సింగ్ హోంలకు మెడికల్ ఆక్సిజన్, ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల వంటి హెల్త్‌కేర్ ఉత్పత్తుల సరఫరాదారులు, తయారీదారులకు ఈ లోన్లు వర్తిస్తాయి. ప్రాసెసింగ్ ఫీజులూ వర్తించబోవని తెలిపింది. ఎంఎస్ఎంఈలకు పూచీకత్తు అక్కర్లేదు. అయితే నాన్ ఎంఎస్ఎంఈలకు 25 శాతం కనీస పూచీకత్తు ఉండాల్సిందే. వచ్చే ఏడాది మార్చి చివరిదాకా ఈ రుణ సౌకర్యం వర్తిస్తుంది.
సురక్ష వ్యక్తిగత రుణం
ఈ లోన్‌పై రూ.25వేల నుంచి 5 లక్షల వరకు తక్షణ రుణ సదుపాయం పొందవచ్చు. కరోనా చికిత్సకు, దవాఖాన నుంచి బయటకు వచ్చిన తర్వాత ఖర్చులకు ఖాతాదారులు ఈ నిధులను వాడుకోవచ్చు. దీనికి 6 నెలల మారటోరియం వర్తిస్తుంది. ప్రాసెసింగ్ ఫీజూ ఉండదు. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకే ఈ పథకం అందుబాటులో ఉంటుంది.