సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 02:28:54

దేశవ్యాప్తంగా ఒక్క రోజే కేసులు 34,956

దేశవ్యాప్తంగా ఒక్క రోజే కేసులు 34,956

మూడు రోజుల్లోనే లక్ష: కేంద్ర ఆరోగ్యశాఖ

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. కేంద్ర ఆరోగ్యశాఖ వివరాల ప్రకారం శుక్రవారం ఉదయం 8 గంటల వరకు దేశంలో మొత్తం 10,03,832 కరోనా కేసులు నమోదయ్యాయి. మొదటి లక్ష కేసులను చేరుకోవడానికి 110 రోజులు పట్టగా, కేవలం మూడు రోజుల వ్యవధిలోనే 9 లక్షల నుంచి 10 లక్షల మార్కును చేరుకోవడం గమనార్హం. గురువారం నుంచి శుక్రవారం ఉదయానికి 24 గంటల్లోనే కొత్తగా 34,956 మందికి కరోనా సోకినట్టు వెల్లడైంది. ఇప్పటి వరకు ఒక్కరోజులో నమోదైన కేసుల సంఖ్య పరంగా ఇదే అత్యధికం. మరోవైపు కొవిడ్‌ కారణంగా ఒక్కరోజులోనే 687 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 25,602కు పెరిగింది. 22,942 మంది డిశ్చార్జి అయ్యారు. ఒక్కరోజులో ఇంతమంది డిశ్చార్జి కావడం ఇదే తొలిసారి. ఇండియాలో ప్రతి 10 లక్షల మంది జనాభాకు 658 కేసులు ఉన్నాయని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.  రికవరీ రేటు 63.33 శాతంగా ఉన్నది. కాగా, దేశవ్యాప్తంగా 9 రాష్ర్టాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుందని లాన్సెట్‌ అధ్యయనం వెల్లడించింది. ఈ రాష్ర్టాల జాబితాలో తెలంగాణ కూడా ఉన్నది. మరోవైపు దేశవ్యాప్తంగా 31.6 లక్షల మంది క్వారంటైన్‌లో ఉన్నారని కేంద్ర హోంశాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.


logo