సోమవారం 13 జూలై 2020
National - Jun 26, 2020 , 15:55:37

కేసులు పెరుగుతున్నా ప‌రిస్థితి అదుపులోనే ఉంది: కేజ్రివాల్

కేసులు పెరుగుతున్నా ప‌రిస్థితి అదుపులోనే ఉంది: కేజ్రివాల్

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నా ప‌రిస్థితి అదుపులోనే ఉన్న‌ద‌ని ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రివాల్ వెల్ల‌డించారు. ఢిల్లీలో ప్ర‌స్తుత ప‌రిస్థితిపై ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం ఏమీ లేద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఈ మ‌ధ్యాహ్నం ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌లో మాట్లాడిన కేజ్రివాల్‌.. ఢిల్లీలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజుకు 3,000 చొప్పున పెరుగుతున్న‌ద‌ని చెప్పారు. అయితే, టెస్టుల సంఖ్యను కూడా గ‌తం కంటే మూడు రెట్లు పెంచామ‌ని కేజ్రివాల్ తెలిపారు. 

ఢిల్లీలో న‌మోదైన మొత్తం పాజిటివ్ కేసుల‌లో 45,000 మంది వైర‌స్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యార‌ని, 2,400 మంది క‌రోనా బాధితులు మృతిచెందార‌ని కేజ్రివాల్ వెల్ల‌డించారు. మ‌రో 26,000 యాక్టివ్ కేసులు ఉన్నాయ‌ని, అందులో వైర‌స్ తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న‌ 6,000 మంది ఆస్ప‌త్రుల్లో, తీవ్రత త‌క్కువ‌గా ఉన్నవారు వారి ఇండ్ల‌లో ఉండి క‌రోనా చికిత్స పొందుతున్నార‌ని తెలిపారు. రోజూ మూడు వేల కేసులు న‌మోద‌వుతున్నా అంద‌రూ ఆస్ప‌త్రిలో చేరాల్సిన అవ‌స‌రం లేనందున గ‌త వారం రోజుల వ్య‌వ‌ధిలో 6,000 ప‌డ‌క‌లు మాత్ర‌మే నిండాయ‌ని చెప్పారు. 

ఢిల్లీలోని ఆస్ప‌త్రుల్లో ప్రస్తుతం 13,500 ప‌డ‌క‌లు అందుబాటులో ఉన్నాయ‌ని, వాటి సంఖ్య‌ను మ‌రింత పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌ని కేజ్రివాల్ చెప్పారు. భ‌విష్య‌త్తులో ఐసీయూ బెడ్‌లు అవ‌స‌ర‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌ని, అందువ‌ల్ల అన్ని కొవిడ్-19 ఆస్ప‌త్రుల్లో ఐసీయూ బెడ్లను అందుబాటులోకి తెచ్చేందుకు చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌ని ఢిల్లీ సీఎం తెలిపారు.      


logo