మంగళవారం 27 అక్టోబర్ 2020
National - Sep 19, 2020 , 16:23:55

నీళ్ల‌డిగినందుకు క‌రోనా రోగిని చావ‌గొట్టిన ద‌వాఖాన సిబ్బంది!

నీళ్ల‌డిగినందుకు క‌రోనా రోగిని చావ‌గొట్టిన ద‌వాఖాన సిబ్బంది!

రాజ్‌కోట్‌: తాగడానికి నీళ్ల‌డిగినందుకు ఓ క‌రోనా రోగిపై ద‌వాఖాన సిబ్బంది మూకుమ్మ‌డిగా దాడికి పాల్ప‌డ్డారు. అస‌లే కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్న అత‌డు ద‌వాఖాన‌కు వ‌చ్చిన త‌ర్వాత శ్వాసతీసుకోవ‌డానికి తీవ్రంగా ఇబ్బంది ప‌డుతున్నాడు. పైగా సిబ్బంది దాడితో అత‌డు ఊపిరి వ‌దిలిన ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఈ విషాధ ఘ‌ట‌న గుజరాత్‌లోని రాజ్‌కోట్ సివిల్ ద‌వాఖాన‌లో జ‌రిగింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది.  

ప్ర‌భాశంక‌ర్ పాటిల్ (38) అనే వ్య‌క్తి కిడ్నీ సంబంధిత వ్యాధితో ప‌న్నెండు రోజుల క్రితం ఓప్రైవేట్ ద‌వాఖాన‌లో చేరాడు. అత‌నికి కిడ్నీలో నీరు చేరిందని బయటపడటంతో వైద్యులు శస్త్ర చికత్స చేశారు. అనంతరం తనకు శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది వస్తోందని ప్రభాశంకర్ చెప్పడంతో డాక్ట‌ర్లు అతడికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో పాజిటివ్ అని తేలింది. దీంతో సెప్టెంబ‌ర్ 8న రాజ్‌కోట్‌లోని సివిల్ ద‌వాఖాన‌లో చేరాడు. అత‌నికి క‌రోనా వార్డులో చికిత్స అందిస్తున్నారు. అయితే త‌న‌కు తాగ‌డానికి నీరు కావాల‌ని సిబ్బందిని అడిగితే స్పందించ‌క‌పోవ‌డంతో అత‌డు ద‌ర్నాకు దిగాడు.

దీంతో కోపంతో ఊగిపోయిన న‌ర్సింగ్ స్టాఫ్ అత‌నిపై దాడికి దిగారు. పీపీఈ కిట్‌లో ఉన్న మెడిక‌ల్ స్టాఫ్ అత‌న్ని కింద‌ప‌డేసి అత‌ని ఛాతీపై మోకాలితో అదిప‌ట్టారు. అక్క‌డే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ప్ర‌భాశంక‌ర్ మెడ‌పై కాలుతో తొక్కిప‌ట్టిన‌ట్లు వీడియోలో రికార్డ‌య్యింది. అయితే రోగి మాత్రం త‌న‌కు నీళ్లు కావాల‌ని అభ్య‌ర్థిస్తున్న‌ట్లు అందులో విన‌బ‌డింది. 

హాస్పిట‌ల్ సిబ్బంది దాడిచేయ‌డంతోనే సెప్టెంబ‌ర్ 12న‌ ప్ర‌భాశంక‌ర్ చ‌నిపోయిన‌ట్లు ఆయ‌న‌ సోద‌రుడు విలాస్ ఆరోపించారు. ఆయనను దారుణంగా కొట్టారని చెప్పారు.  

కాగా, తాము అతడిపై దాడి చేయలేదని ద‌వాఖాన సూప‌రింటెండెంట్ డా. పంక‌జ్ స్పష్టం చేశారు. ప్రభాశంకర్ మతి స్థిమితం లేనట్టు ప్రవర్తిస్తున్నాడ‌ని, ఇత‌ర రోగుల‌పై దాడిచేయ‌డానికి ప్ర‌య‌త్నించ‌డంతో వైద్య‌సిబ్బంది అత‌న్ని అదుపుచేయ‌డానికి మాత్రమే ప్రయత్నించార‌ని, కానీ వీడియో చూసిన వారు మాత్రం తాము దాడి చేస్తున్నట్టు భావించారని చెప్పారు.   


logo